‘మృత్యు కుహరం’ నుంచి తప్పించుకున్నా! | It's easy to go to Pak, but tough to return Uzma | Sakshi
Sakshi News home page

‘మృత్యు కుహరం’ నుంచి తప్పించుకున్నా!

May 26 2017 2:34 AM | Updated on Sep 5 2017 11:59 AM

‘మృత్యు కుహరం’ నుంచి తప్పించుకున్నా!

‘మృత్యు కుహరం’ నుంచి తప్పించుకున్నా!

‘పాకిస్తాన్‌ ఓ మృత్యు కుహరం. ఆ దేశంలోకి వెళ్లడం సులువు. కానీ అక్కడి నుంచి బయట పడటం దాదాపు అసాధ్యం’...

పాక్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ఉజ్మా వ్యాఖ్య
►వాఘా సరిహద్దు ద్వారా ఇంటికి..
►‘భారత పుత్రిక’కు స్వాగతం: సుష్మా


న్యూఢిల్లీ/లాహోర్‌:
‘పాకిస్తాన్‌ ఓ మృత్యు కుహరం. ఆ దేశంలోకి వెళ్లడం సులువు. కానీ అక్కడి నుంచి బయట పడటం దాదాపు అసాధ్యం’... తనను బలవంతంగా పెళ్లి చేసుకున్న పాకిస్తానీ చెర నుంచి భారత్‌కు తిరిగొచ్చిన సందర్భంగా ఢిల్లీ యువతి ఉజ్మాఅహ్మద్‌ ఉద్వేగంతో చేసిన వ్యాఖ్యలివి. పాక్‌ విడిచి స్వదేశానికి వెళ్లేందుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు 20 ఏళ్ల ఉజ్మాకు బుధవారం అనుమతినిచ్చింది. ఈ క్రమంలో ఆమె భారత దౌత్యవేత్తలు, పాకిస్తాన్‌ పోలీసుల భద్రతా వలయంలో అమృత్‌సర్‌ సమీపంలోని వాఘా సరిహద్దు ద్వారా గురువారం దేశంలోకి అడుగుపెట్టింది.

అనంతరం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపీ సింగ్‌ తదితరులతో కలసి ఉజ్మా వివరాలు వెల్లడించింది. ‘పాకిస్తాన్‌ ఓ మృత్యు కుహరం. పెళ్లి తరువాత అక్కడికి వెళ్లిన ఎంతో మంది మహిళల దుస్థితి చూశాను. అక్కడ వారు ఎంతో దారుణ, భయానకమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురేసి భార్యలు కూడా ఉన్నారు’అని ఉజ్మా ఆవేదనగా చెప్పింది. తుపాకీ గురిపెట్టి పాకిస్తాన్‌కు చెందిన తాహిర్‌ అలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపింది. అనంతరం తనకు నిద్ర మాత్రలు ఇచ్చి బునెర్‌కి తీసుకెళ్లాడని, అది తాలిబన్ల అధీనంలో ఉన్న ప్రాంతంలా ఉందని చెప్పింది.

ఆలస్యమయ్యుంటే శవమయ్యేదానిని...
‘మరికొన్ని రోజులు అక్కడ ఉండుంటే శవమై ఉండేదాన్ని. నేను స్వదేశానికి రావడంలో సహకరించిన సుష్మాస్వరాజ్, భారత దౌత్య అధికారులకు ధన్యవాదాలు. ప్రభుత్వం తరఫున చొరవ చూపినందుకు ప్రధాని మోదీని కలసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ కన్నీటి పర్యంతమైంది ఉజ్మా. భారత్‌లాంటి గొప్ప ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదనీ అన్నారు.

ప్రభుత్వం తనకు ఇంత సాయం చేస్తుందని అనుకోలేదనీ, హై కమిషన్‌లో రెండు లేదా మూడేళ్లైనా ఉండొచ్చనీ సుష్మ తనకు చెప్పారన్నారు. తన ఇమిగ్రేషన్‌ డాక్యుమెంట్లు భర్త తాహిర్‌ అలీ లాక్కున్నాడని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని, అవి ఇప్పించి, స్వదేశానికి వెళ్లేలా ఆదేశాలివ్వాలంటూ ఉజ్మా లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై స్పందించిన కోర్టు... ఆమె భారత్‌ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం తీర్పునిచ్చింది.

పాక్‌కు ధన్యవాదాలు: సుష్మా
వాఘా సరిహద్దు ద్వారా దేశంలోకి అడుగుపెట్టిన ఉజ్మాను ‘భారత పుత్రిక’గా అభివర్ణిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆమెకు స్వాగతం పలికారు. ఉజ్మా విషయంలో చొరవ చూపినందుకు పాక్‌ ప్రభుత్వం, అక్కడి న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, పాక్‌ విదేశాంగ, హోం శాఖలు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఉజ్మా న్యాయవాది బారిస్టర్‌ షాన్వాజ్‌ ఆమెను తన బిడ్డలా భావించారని, జస్టిస్‌ మోహిసిన్‌ అక్తర్‌ కియానీ మానవీయ కోణంలో కేసును చూశారని అన్నారు. ఉజ్మా వాఘా సరిహద్దు దాటిన వెంటనే ఊపిరి పీల్చుకున్నానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement