ఓ బాబాతో ఐపీఎస్ చెట్టపట్టాల్..
కేంద్రాపడా జిల్లా మాజీ ఎస్పీ సతీష్ గజ్వియే సస్పెండు చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారి సతీష్ గజ్వియే అక్రమాలు
కేంద్రపడాలో భార్య పేరుతో తొమ్మిదెకరాలు కొనుగోలు
నేడు డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లా మాజీ ఎస్పీ సతీష్ గజ్వియే సస్పెండు చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేయడం విశేషం. వివాదం ఆరంభం నుంచి సతీష్ గజ్వియేకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తొలినాడే కేంద్రాపడా నుంచి కటక్ పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నితిన్జిత్ సింగ్‌ని ఎస్పీగా నియమించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎటువంటి విధుల్ని కేటాయించలేదు. ప్రాథమిక దశలో ఆయనకు సస్పెండు చేసినట్లు సాధారణ వర్గాలు భావించాయి. క్రమంగా వాస్తవాన్ని గుర్తించడంతో ఆందోళన ఉధృతమైంది. ప్రతిపక్ష కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీతో ఒడిశా హై కోర్టు బార్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంఘాలు కూడా గజ్వియేకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.
కేంద్రాపడా మాజీ ఎస్పీ సతీష్ గజ్వియేకు వ్యతిరేకంగా దుమారం రేపిన వివాదాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర డీజీపీ సంజీబ్ మారిక్ సెంట్రల్ ఐజీ ఆర్పీ కోచేకు ఆదేశించారు. ఆందోళన అదుపు చేయడంలో హద్దు మీరిన వైఖరి, పాలనాపరమైన చర్యలపట్ల సోషల్ మీడియాలో వ్యాఖ్యలు అఖిల భారత సేవా నిబంధనల ఉల్లంఘనని ప్రేరేపించినట్లు ధృవీకరించి కేంద్రాపడా మాజీ ఎస్పీ సతీష్ గజ్వియేను సస్పెండు చేసినట్లు ప్రకటించారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుండగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించడం గమనార్హం.
ఉపాధ్యాయుడి పై వేటు
భువనేశ్వర్: సారథి బాబా వివాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండు చేసినట్లు గురువారం అధికారులు తెలిపారు. కేంద్రాపడా బరిముల ఆశ్రమం నిర్వహణతో ఆయనకు సంబంధం ఉన్నట్లు ప్రధాన ఆరోపణ. బాబా అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా మీడియాతో స్పందించిన వైఖరిని ప్రభుత్వం తప్చబట్టింది. మహంగ వీరభద్రేశ్వర హై స్కూల్లో సైన్సు ఉపాధ్యాయుడు శరత్ చంద్ర పాత్రోను ప్రభుత్వం సస్పెండు చేయడం చర్చనీయాంశమైంది.
రుజువైతే చర్యలు : హోమ్ శాఖ కార్యదర్శి
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లా మాజీ ఎస్పీ సతీష్ గజ్వియేపై వచ్చిన అభియోగాలు రుజువైతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సారథి బాబా వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అప్రమతైందని చెప్పారు. దీనిపై క్రైంశాఖ దర్యాప్తు వేగంగా సాగుతోందని చెప్పారు. బాబా ఆశ్రమం వద్ద ఆందోళనకారులపై పోలీసుల హద్దు మీరి ప్రవర్తించారన్న అభియోగంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించినట్లు చెప్పారు.
నేడు ముట్టడి
సాక్షి, భువనేశ్వర్ :రాష్ట్రంలో బాబా అక్రమాస్తుల వ్యవహారం, ఓ ఐపీఎస్ అధికారి ఏకంగా భూ వివాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్ మెంట్లు చేయడం, ఎస్పీగా పనిచేస్తూ తొమ్మిది ఎకరాల భూమిని నది పక్కన కొనుగోలు చేయడం ఇలా ఈ అన్ని వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేయించడంతోపాటు వారిని శిక్షించాలనే డిమాండ్‌తో రాష్ట్ర బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఎస్పీని శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా, ఆందోళనకు పిలుపునిచ్చింది. బాబా, ఎస్పీలపై తక్షణం ప్రత్యేక విచారణ జరిపించాలని లేకపోతే 14, 17 తేదీల్లో పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ సింగ్‌దేవ్, పార్టీ సీనియర్ నేత విజయ్ మహాపాత్రో హెచ్చరించారు.
ఆయన తప్పేంటి?
భువనేశ్వర్: అక్రమాల సారథి బాబాతో కుమ్మక్కైన ఐపీఎస్ అధికారి సతీష్ గజ్వియేపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతుంటే, ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. సక్రమంగా విధి నిర్వహించడమే తప్పా అని రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, తెగలు, బలహీన వర్గాల సమన్వయ సమితి అభిరావ్ మల్లిక్ ప్రశ్నించారు. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమితి కార్యకర్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆందోళనలు చెలరేగినపుడు పోలీసులు లాఠీచార్జీ చేయడం సాధారణమన్నారు. బరిముల ఆశ్రమం వద్ద జరిగిన లాఠీచార్జీలో ఎవరూ గాయపడలేదన్నారు. మహిళా వేషధారణతో బాబాను ఆశ్రమం నుంచి తప్పించేందుకు కొందరు ప్రయత్నించగా అదుపులోకి తీసుకోవడంతో సతీష్ గజ్వియే కీలక పాత్ర పోషించారన్నారు.


