విద్యుత్ సరఫరాకు కూడా నగదు బదిలీ పథకం అమలుకు నీతి ఆయోగ్ మద్దతు తెలిపింది.
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల మాదిరిగానే విద్యుత్ సరఫరాకు కూడా నగదు బదిలీ(డీబీటీ) పథకం అమలుకు నీతి ఆయోగ్ మద్దతు తెలిపింది. కనీవిని ఎరగని రీతిలో పెద్దనోట్లను రద్దు చేసిన దేశం విద్యుత్ రంగంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే సాహసం చేయొచ్చని అభిప్రాయపడింది. అధిక భాగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ రంగంలో సత్ఫలితాలు సాధించాలంటే దీర్ఘకాలంలో ప్రైవేటీకరణ చేపట్టాలని సంస్థ సీఈఓ అమితాబ్ కాంత్ సూచించారు. బుధవారం ఆయన ఇండియా ఎనర్జీ ఫోరంలో మాట్లాడారు.
‘ఏ వినియోగదారుడు కూడా డీబీటీ లేకుండా విద్యుత్ పొందకూడదు. బలవంతంగానైనా దీన్ని అమలు చేయాలి. మార్కెట్ ధరల ప్రాతిపదికన ధరలు నిర్ణయించే, పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించే నియంత్రణ సంస్థలు రావాలి’ అని కాంత్ అన్నారు. దిగువ స్థాయుల్లో మీటర్ విధానం అమల్లోకి రాకుంటే విద్యుత్ రంగం మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. డీజిల్ వినియోగం తగ్గించాలంటే కాలుష్య పన్నులు విధించాలని సూచించారు. కేవలం పదేళ్లే జీవిత కాలమున్న బొగ్గు వాడకాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ ఇంధన రంగం విష వలయంలో చిక్కుకుందని ఇందులో మార్పు రావాలని తెలిపారు.