పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్తో పాటు అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్లపై ఇంటర్ పోల్ మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు ఇంటర్ పోల్ మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మసూద్ తో పాటు అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్లపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. అలాగే ఇంటర్పోల్ ఈ కేసులో మరో ఇద్దరు షాహిద్ లతిఫ్, ఖషీఫ్ జాన్పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు కమెండోలు మృతి చెందారు. ఇక పాకిస్థాన్లో ఉంటూనే ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ అక్కడి నుంచే ఉగ్రవాదులను పంపాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తేల్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంటును సీబీఐ ఇంటర్ పోల్ కు పంపి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది.