పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి నిలిచిపోతుంది

Inspiring Story About Surat Woman With End Stage Brain Tumor Plants Trees - Sakshi

సూరత్‌ : కొందరు చావు పేరు చెబితేనే ఆమడ దూరం వెళ్లిపోతారు. మరికొందరు చావు పేరు వింటేనే మా గుండెల్లో దడ మొదలవుతుంది అంటారు. మరీ అలాంటిది  ఒక మహిళ మాత్రం కొద్దిరోజుల్లో తాను మరణిస్తానన్న విషయం తెలిసినా ఏ మాత్రం అధైర్యపడకుండా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ఎంచుకున్నారు. ఆమె గుజరాత్‌కు చెందిన 27ఏళ్ల శ్రుచి వదాలియా.. గుజరాత్‌లోని సూరత్‌ సిటీకి వెళ్లి అడిగితే ఎవరైనా ఈమె గురించి వివరిస్తారు. మరి ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

'చనిపోయేలోగా నేను నాటిన మొక్కల ద్వారా కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నట్లు' శ్రుచి వదాలియా పేర్కొంటున్నారు. శ్రుచి వదాలియాకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రెయిన్‌ ట్యూమర్‌ సోకింది. ఇప్పుడామే తన జీవితంలో చివరి దశకు వచ్చేసింది.. అంటే కొన్ని రోజుల్లో ఈ లోకం విడిచివెళ్లనుంది. అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా తాను చనిపోయేలోగా సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా  పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించింది.  తనకు బ్రెయిన్‌ ట్యూమర్‌ రావడానికి వాయు కాలుష్యం కూడా ఒక కారణమని భావించిన శ్రుచి వదాలియా తాను చనిపోయేలోగా వీలైనన్ని మొక్కలు నాటి ప్రమాదకర కాన్సర్‌తో పాటు, కొంతమేరైనా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని నిర్ణయించుకొంది. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మంచి చేయడంతో పాటు ప్రమాదకర కాన్సర్‌ను నివారించే అవకాశం ఉందని శ్రుచి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు సంవత్సరాలలో 30వేలకు పైగా మొక్కలు నాటడమే గాక మిగతవారిని కూడా ఆ  పని చేయమని ప్రోత్సహిస్తున్నారు.

'నేను చనిపోతానని నాకు తెలుసు. కానీ నేను పెంచే మొక్కల ద్వారా వచ్చే గాలిని పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. నాలాగా ఎవరు ఈ వ్యాధికి గురవకూడదనేదే నా ప్రయత్నం. అందుకే వీలైనన్ని మొక్కలను పెంచి నా వంతుగా పర్యావరణానికి మేలు చేస్తున్నానని' శ్రుచి వదాలియా భావోద్వేగంతో తెలిపారు.  శ్రుచి వదాలియా సూరత్‌లోని ప్రతీ పాఠశాలలకు తిరిగి ఒక్కో పిల్లాడి చేత మొక్కను నాటించి పర్యావరణాన్ని కాపాడే భాద్యతను ఎత్తుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top