ఇంటివద్దకే వైద్య సేవలు.. | Indis's first home-based health care service launched Guwahati | Sakshi
Sakshi News home page

ఇంటివద్దకే వైద్య సేవలు..

Aug 31 2016 5:09 PM | Updated on Sep 4 2017 11:44 AM

'హోమెల్త్' ను ఈశాన్య ఇండియాలో మొదటిసారి ప్రారంభించారు. ఈ సేవలో 24 గంటలూ ఇంటికే వచ్చి.. వైద్యం అందించేందుకు వీలుగా డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటారు.

గౌహతిః అత్యవసర వైద్యంకోసం అంబులెన్స్ సర్వీసులను ఇప్పటికే ఎన్నో ఆస్పత్రులు అందిస్తుండగా... హోమ్ హెల్త్ కేర్ మార్కెట్ కూడా రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. ఇల్లు కదలకుండానే అత్యవసర వైద్యం అందుకునే హోమ్ హెల్త్ కేర్  సేవలకూ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో హోమ్ బేస్డ్ హెల్త్ కేర్ సర్వీస్ 'హోమెల్త్' ను ఈశాన్య ఇండియాలో మొదటిసారి ప్రారంభించారు. ఈ సేవలో భాగంగా 24 గంటలూ ఇంటికే వచ్చి.. వైద్యం అందించేందుకు వీలుగా డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటారు.

ఎటువంటి అత్యవసర వైద్యాన్నైనా వెంటనే అందించేందుకు వీలుగా తమ ఫిజీషియన్లు, డైటీషియన్లు, పారామెడిక్స్ అంతా అందుబాటులో ఉంటారని  'హోమెల్త్'  స్థాపకురాలు, సీఈవో డాక్టర్ సిమంతా శర్మ తెలిపారు. పేషెంట్లను ఆస్పత్రికి తీసుకెళ్ళే అవసరం లేకుండా వారి వద్దకే వైద్యం వచ్చే అవకాశం ఈ ప్రత్యేక సేవల్లో అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాక పేషెంట్లకు ఇష్టమైన చోట, ఇష్టమైన రీతిలో వైద్యం అందించేందుకు ఈ ప్రత్యేక సేవలు ఎంతగానో సహకరిస్తాయని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలోనూ రోగులను ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి లేకుండా... స్పెషలిస్ట్ లు, సూపర్ స్పెషలిస్టులు ఇంటివద్దే, రోగులకు అనుకూలంగా వైద్యం అందిస్తారని శర్మ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్లు అందించినట్లుగానే ఎంతో సౌకర్యవంతమైన, సంప్రదాయ బద్ధమైన, శాస్త్రీయమైన  వైద్యాన్ని... ఆధునిక సాంకేతికతను వినియోగించి అత్యవసరంగా అందిచే ఏర్పాటు హోమెల్త్ ద్వారా చేసినట్లు చెప్పారు.

హోమెల్త్ ప్రత్యేక సేవలను ముందుగా గౌహతిలో ప్రారంభిస్తున్నామని, అనంతరం అస్పాంలోని అన్ని ప్రాంతాల్లోనూ విస్తరింపజేస్తామని శర్మ తెలిపారు. ఆస్పత్రి చికిత్సతో పోలిస్తే మెరుగైన వైద్యం ఈ సేవల్లో అందుతుందని, డాక్టర్లు, నర్సులను ఇంటికి పంపి, నర్సింగ్ సేవలు అందించడమే కాక, రోగుల అవసరాలను బట్టి శాంపిల్ కలెక్షన్, లేబొరేటరీ టెస్టులు, మందులు, ఈసీజీ వంటి సౌకర్యాలను ఇంటివద్దే అందే విధంగా హోమెల్త్ సహకరిస్తుందని తెలిపారు. ఇటీవల భారత్ లో హోమ్ హెల్త్ కేర్ కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో రోగులకు అందుబాటులో ఉండేట్లుగా తమ సేవలను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ సిమంతా శర్మ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement