ఈ యుద్ధంలో మీరే సారథులు

India Is war against Coronavirus is people-driven - Sakshi

కరోనాపై భారత్‌ పోరును చరిత్ర చెప్పుకుంటుంది

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధానికి ప్రజలే సారథులని ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రజల సారథ్యంలోయుద్ధం సాగించడం ద్వారానే భారత్‌లో ఈ ప్రాణాంతక మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందన్నారు.  ప్రతీ నెల చివరి ఆదివారం రోజు చేసే రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో ఆదివారం ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత.. భవిష్యత్తులో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. ఈ మహమ్మారిపై ప్రజల నేతృత్వంలో భారత్‌ జరిపిన పోరును చరిత్ర చెప్పుకుంటుందని వ్యాఖ్యానించారు. నెల రోజులకు పైగా కొనసాగిన లాక్‌డౌన్‌కు కొన్ని మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో.. ‘అతి విశ్వాసం వద్దు. మీ నగరానికో, మీ పట్టణానికో, మీ గ్రామానికో లేక మీ వీధిలోకో కరోనా ఇంకా రాలేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉండకండి’అని హెచ్చరించారు.   

వారికి నా నమస్సులు: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తదితర వర్గాలను ఆయన కొనియాడారు. ఆపద సమయంలో అన్నార్తులకు సాయమందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను ప్రశంసించారు. ఆపత్కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు సహా పలు ప్రపంచ దేశాలకు ఔషధ సాయం అందించిన భారత్‌.. ప్రపంచదేశాధినేతల ప్రశంసలు పొందిందని వివరించారు. యోగా తరువాత ఇప్పుడు ఆయుర్వేదం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే అత్యుత్తమ మార్గాలుగా వాటిని ప్రపంచం ఇప్పుడు చూస్తోందన్నారు.  

వారియర్స్‌గా మారండి
కరోనాపై పోరులో ప్రతీ ఒక్కరు తమ శక్తిమేరకు పోరాడుతున్నారని, ‘సర్వేజన సుఖినోభవంతు’భావన ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయిందని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ‘కోవిడ్‌ వారియర్స్‌. గవ్‌.ఇన్‌’లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 1.25 కోట్ల మంది రిజిస్టరయ్యారన్నారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం, అక్షయ త్రిథియ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ కన్నా ముందే ఈ కరోనా మహమ్మారి పీడ ప్రపంచానికి తొలగాలని, గతంలో మాదిరిగానే ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుందామని ఆకాంక్షించారు.  

వారిపై గౌరవం పెరిగింది
పారిశుద్ధ్య కార్మికులు, ఇంటి దగ్గరి కిరాణా వర్తకులపై ప్రజల అభిప్రాయాల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు కూడా తొలగిపోయాయని, వారిలోని మానవీయ కోణాన్ని ఇప్పుడు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే నెల మన్‌ కీ బాత్‌ నాటికి కరోనాపై పోరు విషయంలో ఒక శుభవార్త వినాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. అయితే, అంతవరకు భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం.. తదితర జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top