గిన్నిస్‌ కిచిడీ @ 918 కేజీలు

India sets Guinness world record by cooking 918 kg khichdi - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఇంటికీ సుపరిచితమైన కిచిడీ వంటకంతో భారత్‌ గిన్నిస్‌ రికార్డును సాధించింది. దేశరాజధానిలో జరుగుతున్న వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా–2017 కార్యక్రమంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్, ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ పర్యవేక్షణలో 50 మంది చెఫ్‌ల బృందం 918 కేజీల కిచిడీని తయారుచేసి ఈ ఘనతను సాధించింది. నవంబర్‌ 3 నుంచి ఆదివారం వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), గ్రేట్‌ ఇండియా ఫుడ్‌ స్ట్రీట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బియ్యం, పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలు, కూరగాయలతో ఈ కిచిడీని తయారుచేశారు.

కనీసం 500 కేజీలు దాటితేనే గిన్నిస్‌ రికార్డు సొంతమయ్యే అవకాశం ఉండటంతో ఏకంగా 918 కేజీల కిచిడీని రూపొందించటం విశేషం. ఇందుకోసం 3 నెలల ముందుగానే సన్నాహకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆహారశుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. అన్ని పోషకాలను కలిగి ఉండే ఏకైక ఆహారం కిచిడీయేనని తెలిపారు. ఈ కిచిడీని అక్షయ ఫౌండేషన్, గురుద్వారాల సాయంతో దాదాపు 60,000 మందికి పంచిపెడతామన్నారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పౌలినా సపిస్కా స్పందిస్తూ.. భారత్‌ 918 కేజీల కిచిడీని రూపొందించి గిన్నిస్‌ రికార్డు సాధించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆహారశుద్ధి  సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, యోగా గురువు బాబా రాందేవ్, డెన్మార్క్‌ ఆహార మంత్రి ఎస్బెన్‌ లుండే తదితరులు పాల్గొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top