breaking news
World Food India -2017
-
గిన్నిస్ కిచిడీ @ 918 కేజీలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఇంటికీ సుపరిచితమైన కిచిడీ వంటకంతో భారత్ గిన్నిస్ రికార్డును సాధించింది. దేశరాజధానిలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా–2017 కార్యక్రమంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ పర్యవేక్షణలో 50 మంది చెఫ్‌ల బృందం 918 కేజీల కిచిడీని తయారుచేసి ఈ ఘనతను సాధించింది. నవంబర్ 3 నుంచి ఆదివారం వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), గ్రేట్ ఇండియా ఫుడ్ స్ట్రీట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బియ్యం, పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలు, కూరగాయలతో ఈ కిచిడీని తయారుచేశారు. కనీసం 500 కేజీలు దాటితేనే గిన్నిస్ రికార్డు సొంతమయ్యే అవకాశం ఉండటంతో ఏకంగా 918 కేజీల కిచిడీని రూపొందించటం విశేషం. ఇందుకోసం 3 నెలల ముందుగానే సన్నాహకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆహారశుద్ధి శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. అన్ని పోషకాలను కలిగి ఉండే ఏకైక ఆహారం కిచిడీయేనని తెలిపారు. ఈ కిచిడీని అక్షయ ఫౌండేషన్, గురుద్వారాల సాయంతో దాదాపు 60,000 మందికి పంచిపెడతామన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ పౌలినా సపిస్కా స్పందిస్తూ.. భారత్ 918 కేజీల కిచిడీని రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆహారశుద్ధి సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, యోగా గురువు బాబా రాందేవ్, డెన్మార్క్ ఆహార మంత్రి ఎస్బెన్ లుండే తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. లక్షా 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ మేరకు వరల్డ్ ఫుడ్ ఇండియా–2017 సదస్సు సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇస్తున్న రాయితీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటు కోసం 13 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బికనీర్‌వాలా, ప్రయాగ్ న్యూట్రియన్స్ ఫుడ్, అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బేకరీస్, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీమ్‌లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలు తదితర రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మొత్తంగా సదస్సులో రెండు రోజుల్లో కుదుర్చుకున్న మొత్తం ఒప్పందాల విలువ రూ.7,200 కోట్లకు చేరింది. వీటి ద్వారా రాష్ట్రంలో 10 వేల మందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం తెలంగాణలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని.. 1,25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం పెద్దదే అయినా.. రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో అనుసంధానం చేయడం ద్వారా అది సాధ్యమవుతుందని ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం, ఆగ్రో ఉత్పత్తుల సాగులో శిక్షణ ఇచ్చి నాణ్యమైన ఉత్పత్తులు చేయండం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మరింత ఆయకట్టు సాగులోకి వచ్చి రైతుల ఆదాయంలో వృద్ధి వచ్చే అవకాశముంది. మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేస్తున్న చెరువులను సాగునీటి అవసరాలకే కాకుండా చేపల పెంపకానికి కూడా వినియోగిస్తాం. ఇది ఒక విప్లవం కాబోతోంది. ఈ–నామ్ మార్కెట్ల ద్వారా మధ్యవర్తి అవసరం లేకుండా రైతు తాను పండించిన పంటను నేరుగా అమ్మే వెసులుబాటు ఉంది. మొత్తంగా ఒకే పంటపై ఆధారపడకుండా అదనంగా గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చెరువుల్లో చేపల పంపకం, ఆగ్రో ఉత్పత్తుల సాగులో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల సామర్థ్యాన్ని కూడా 4 లక్షల టన్నుల నుంచి 21 లక్షల టన్నులకు పెంచాం..’’ అని తెలిపారు. సులభ వ్యాపారంలో మేమే నంబర్ వన్ సులభతర వాణిజ్య, వ్యాపార అంశం (ఈవోడీబీ)లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని.. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, అనుమతుల మంజూరులో పారదర్శకతే దీనికి కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్–ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని, జాప్యం చేస్తే సంబంధిత అధికారిపై జరిమానా కూడా విధిసున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ప్రారంభించిన రెండున్నరేళ్లలో ఐదు వేల అనుమతులిచ్చామని.. తద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆరు రకాల నేలలు భిన్న పంటలకు నిలయంగా ఉన్నాయని, అందుకే తెలంగాణ సీడ్ బౌల్‌గా ఉందని చెప్పారు. పసుపు సాగులో దేశంలోనే మొదటి స్థానంలో, మిర్చి, మొక్కజొన్నలో రెండో స్థానం, గుడ్ల ఉత్పత్తి, మామిడిలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నామని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని రకాల అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోని ముఖ్య అంశాలు – పాలసీ కాలపరిమితి ఐదేళ్లు.. – వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ – 1,25,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక – రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం – దీని కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, చేపల పెంపకం, పశుసంపద పంపిణీ కార్యక్రమాలను అనుసంధానం చేయడం – అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం–ఆహార ఉత్పత్తుల వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయడం – ఇందుకోసం ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్కుల అభివృద్ధి – సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని 20 శాతం పెంచడం – పాలసీలో భాగంగా స్టార్టప్స్ కోసం అగ్రి నిధి ఏర్పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కల్పిస్తున్న రాయితీలివే.. – ఆయా పరిశ్రమలకు భూముల ధరల తగ్గింపు – స్టాంపు డ్యూటీ, కరెంటు బిల్లులు, వ్యాట్ రీయింబర్స్మెంట్, వడ్డీపై సబ్సిడీ – మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చించిన ఖర్చు రీయింబర్స్ – ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి సాయం – శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి కోసం చేసే ఖర్చు రీయింబర్స్ -
ఆహారశుద్ధి ప్రక్రియే ఏకైక మార్గం
అప్పుడే పెరుగుతున్న ఆహార అవసరాలను అధిగమించగలం: హర్‌సిమ్రత్‌కౌర్ సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న ఆహార అవసరాలను అధిగమించాలంటే ఆహార శుద్ధి ప్రక్రియే ఏకైక మార్గమని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ పేర్కొన్నారు. కూరగాయలు, పండ్ల సాగులో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మనదేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆహార ఉత్పత్తుల వినియోగంలో భారత్ ఆరో స్థానంలో ఉందని చెప్పారు. నవంబర్ 3 నుంచి ఢిల్లీలో జరిగే వరల్డ్ ఫుడ్ ఇండియా– 2017 ప్రచారంలో భాగంగా గురువారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే వరల్డ్ ఫుడ్ ఇండియా–2017లో పలు దేశాలు, రాష్ట్రాలు, వివిధ సంస్థలు, పరిశ్రమలు.. ఆహారశుద్ధి ప్రక్రియకు సంబంధించిన సాంకేతికత, ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. హర్‌సిమ్రత్‌కౌర్ మాట్లాడుతూ.. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో పది శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, ఈ పరిస్థితి మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సంపద యోజన పేరిట ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు. రూ.6,000 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటులో భారీ రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆహారశుద్ధి ప్రక్రియ వల్ల వ్యర్థాలను అరికట్టడమే కాకుండా రైతులకు, వినియోగదారులకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, నాణ్యతతో పాటు ధరలు కూడా అదుపులోకి వస్తాయన్నారు. విత్తన పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమతో పాటు విత్తన పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు మెగా ఆహార శుద్ధి యూనిట్లు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీటిలో ఇప్పటికే ఒక యూనిట్ పూర్తయిందని, మరో మూడింటిని అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధప్రసాద్.. కిసాన్ సంపద యోజన పథకానికి సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కంబట్టా, రాష్ట్ర చైర్మన్ వి.రాజన్న తదితరులు పాల్గొన్నారు.