గగన్‌యాన్‌’తో చైనా సరసన

India nowhere less than China in arena of space - Sakshi

2022 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్ర

ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌  

న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో చైనాతో పోటీ పడుతున్నప్పటికీ గగన్‌యాన్‌ విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనల్లో పొరుగుదేశంతో భారత్‌ సమాన స్థాయి పొందుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ కె.శివన్‌ శుక్రవారం వెల్లడించారు. చైనా ప్రయోగించిన చాంగ్‌–4 చంద్రుడి ఆవలివైపు ఈ నెలలో దిగి పరిశోధనలు ప్రారంభించిందని, భారత్‌కూడా చంద్రయాన్‌–2 ద్వారా చంద్రుడి ఆవలివైపు పరిశోధనలకు పూనుకుందని ఆయన తెలిపారు.

అంతరిక్ష పరిశోధనల్లో ప్రస్తుతానికి భారత్‌ చైనాతో పోటీ పడుతున్నప్పటికీ, 2022 తరువాత భారత్‌ కూడా చైనాకు దీటుగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో ఈ రెండు దేశాలు కీలకమైనవి, భారత్‌ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా తన పొరుగుదేశాలకు సాంకేతికతను కానుకగా ఇచ్చిందని, అదే సమయంలో చైనా కూడా పాకిస్తాన్, శ్రీలంకలకు తన సాంకేతికతను అందజేస్తోందని ఆయన వివరించారు. 2017లో భారత్‌ ప్రయోగించిన ఉపగ్రహ సేవల ద్వారా నేపాల్‌లో చాలాచోట్ల ప్రజలు తొలిసారి టీవీ కార్యక్రమాలు వీక్షించగలిగారని ఆయన అన్నారు. భారత్‌ స్వయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్, జీపీఎస్‌ వ్యవస్థపై అడిగిన ప్రశ్నకు ‘సైనిక దళాలు ఇప్పటికే సొంత నావిగేషన్, జీపీఎస్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయని’శివన్‌ సమాధానమిచ్చారు.

‘గగన్‌యాన్‌’లో పైలెట్లకే అవకాశం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రాజెక్టులో భాగమైన గగన్‌యాన్‌లో వ్యోమగాములుగా పైలెట్లు ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని  ఇస్రో వెల్లడించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రకోసం వ్యోమగాముల ఎంపికలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. ఈ పరిశోధనలో రక్షణ పరిశోధన శాఖ పాత్ర కీలకమని మరో శాస్త్రవేత్త అన్నారు. మానవరహిత గగన్‌యాన్‌ మిషన్‌ను 2020 డిసెంబర్‌ నాటికి, మానవ సహితంగా 2021 డిసెంబర్‌కి పూర్తి చేయడమే తమ లక్ష్యమని శివన్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top