‘రక్షణ నిధుల’ టాప్‌–5లో భారత్‌

‘రక్షణ నిధుల’ టాప్‌–5లో భారత్‌


సౌదీ, రష్యాలను అధిగమించి పైకి..

అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా, చైనా, బ్రిటన్‌

రెండేళ్లలో మూడోస్థానానికి భారత్‌... తాజా నివేదికలో వెల్లడి


లండన్‌: ప్రపంచంలో రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించే టాప్‌–5 దేశాల జాబితాలో భారత్‌ చేరింది. సౌదీఅరేబియా, రష్యాలను మించి 50.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.34 వేల కోట్లు) మిలటరీ బడ్జెట్‌కు కేటాయించినట్లు తాజాగా వెల్లడైంది. రక్షణ రంగంలో అధికంగా ఖర్చుచేసే మొదటి మూడు దేశాల్లో అమెరికా, చైనా, బ్రిటన్‌ కొనసాగుతున్నాయి. వీటితర్వాత ఎక్కువగా నిధులు వెచ్చించే స్థానంలో భారత్‌ నిలిచిందని, ఆ తర్వాత సౌదీఅరేబియా, రష్యా ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ‘2016 జేన్స్‌ రక్షణ బడ్జెట్ల నివేదిక’వెల్లడించింది. దీన్ని ‘ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌’అధ్యయన సంస్థ విడుదల చేసింది.


భారత్‌ గత ఏడాది 46.6 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేయగా, ఈ ఏడాది 50.7 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేసింది. అయితే, 2018 నాటికి భారత్‌ మిలటరీ నవీకరణలో భాగంగా బ్రిటన్‌ను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకుతుందని తెలిపింది. ఏ దేశానికి అందని రీతిలో అమెరికా ఏకంగా ఏటా 622 బిలియన్‌ డాలర్లను ఖర్చుపెడుతుండగా, చైనా 191.7 బిలియన్‌ డాలర్లను, బ్రిటన్‌ 53.8 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తున్నాయి. సౌదీఅరేబియా 48.68 బిలియన్స్, రష్యా 48.44 బిలియన్‌ డాలర్లను రక్షణ రంగంపై ఖర్చుపెడుతున్నాయి. 2010లో 38 బిలియన్‌ డాలర్లు ఉన్న భారత రక్షణ బడ్జెట్‌ 2020 నాటికి 64 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆ సంస్థ అంచనావేసింది. ‘గత మూడు సంవత్సరాల్లో భారత్‌ ఆయుధాల సేకరణపై తగ్గించినా సిబ్బంది రూపంలో ఎక్కువ బడ్జెట్‌ వినియోగించింది.


2017 నుంచి మిలటరీ ఆధునీకరణపై భారత్‌ దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. ఇందులోభాగంగా కొత్త పరికరాలు అవసరమవుతాయి. మూడేళ్ల తర్వాత రక్షణరంగ సరఫరాదారులకు భారత్‌ ముఖ్యదేశమవుతుంది’అని ఐహెచ్‌ఎస్‌ జేన్స్‌ ముఖ్యవిశ్లేషకుడు క్రెయిగ్‌ కేఫ్రీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణకు వెచ్చించే నిధుల వినియోగం ఒక శాతం పెరిగి 1.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top