‘ఇండియా వదిలి వెళ్లడమే నా పెద్ద తప్పు’

IMA Jewels Scam Accused Says Coming To India In New Video - Sakshi

బెంగళూరు : దేశం నుంచి వెళ్లిపోయి తాను పెద్ద తప్పు చేశానని ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్‌ యజమాని మహమ్మద్‌ మన్సుర్‌ ఖాన్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 24 గంటల్లో స్వదేశానికి తిరిగి వస్తానని అయితే తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులకు విఙ్ఞప్తి చేశాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మందిని మోసగించిన మన్సుర్‌ ఖాన్‌.. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..‘ దేవుడి అభీష్టం మేరకు 24 గంటల్లో నేను ఇండియాకు తిరిగి వస్తాను. ఈ కేసులో చట్టబద్ధంగా పోరాడుతా. కనీసం నాకు లాయర్‌ కూడా లేడు. అయితే భారత న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. భారత్‌ను వదిలిపెట్టి రావడమే నేను చేసిన పెద్ద తప్పు. కానీ ఆ పరిస్థితుల్లో అంతకంటే మంచి మార్గం కనిపించలేదు. ప్రస్తుతం నా కుటుంబం ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. రెండు రోజుల క్రితమే బెంగళూరు వద్దామనుకున్నా. కానీ ఆరోగ్యం సహకరించలేదు’ అని వీడియోలో పేర్కొన్నాడు.

కాగా అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్‌ ఖాన్‌ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఐ మానిజటరీ అడ్వైజరీకి చెందిన దాదాపు రూ. 209 కోట్ల ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనం చేసుకొంది. సుమారు 40 వేల మంది డిపాజిట్‌దారులకు వంచించిన మన్సూర్‌ ఖాన్‌కు చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ.197 కోట్ల స్థిరాస్తి, రూ.12 కోట్లు నగదు ఉన్నట్లు పత్రికా ప్రకటనలో ఈడీ అధికారులు తెలిపారు.

ఇక ఐఎంఏ వంచన కేసులో తలదాచుకున్న మన్సూర్‌ ఖాన్‌ వ్యవతిరేకంగా బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీచేశారు. ఇటీవల మన్సూర్‌ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఇంటర్‌ పోల్‌కు ప్రతిపాదన సమర్పించింది. వేలాకోట్ల వంచన కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా డబ్బు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. అంతేకాకుండా కేసు దర్యాప్తును ఎస్‌ఐటీకి అప్పగించింది. ఇదే సందర్భంలో ఐఎంఏ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో విదేశీ లావాదేవీలు కూడా జరిగిందన్న అంశాన్ని కనుగొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మన్సూర్‌ భారత్‌కు వచ్చేస్తానంటూ వీడియో విడుదల చేయడంతో ఈ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలపై ఆరోపణలు చేసిన మన్సూర్‌ తిరిగి రావడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే అంశం చర్చనీయాంశమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top