మేము ఆ లెక్కలు వేయం

IAF doesn't count the dead - Sakshi

ప్రభుత్వమే వివరాలు ప్రకటించాలి

‘బాలాకోట్‌’ మృతుల సంఖ్యపై ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా

ఉగ్రవాదులకు జరిగిన నష్టంపై భిన్న కథనాల నేపథ్యంలో స్పందన

పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాకే మళ్లీ కాక్‌పిట్‌లోకి అభినందన్‌ అని వెల్లడి

కోయంబత్తూర్‌: పాకిస్తాన్‌ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు అంతమయ్యారన్న విషయంలో ఎడతెగని చర్చ నడుస్తున్న వేళ వైమానిక దళ చీఫ్‌ బీఎస్‌ ధనోవా సోమవారం స్పందించారు. వైమానిక దాడుల్లో చోటుచేసుకున్న నష్టం వివరాల్ని ప్రభుత్వమే వెల్లడించాలని, మృతుల సంఖ్యను తాము లెక్కించమని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించామా? లేదా? అన్నదే తమకు ముఖ్యమన్నారు. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 26న పాక్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్సులో జైషే శిక్షణశిబిరాలపై భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది.

ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలపగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా 250 మంది మరణించారని చెప్పారు. ఉగ్రవాదులకు వాటిల్లిన నష్టం తక్కువేనని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం బయటకురాలేదు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ధనోవా మాట్లాడారు. ‘ వైమానిక దాడిలో ఎందరు చనిపోయారో మేము లెక్కించం. ఆ సమయంలో అక్కడ ఎందరున్నారన్న దానిపై ఆ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వమే ఆ వివరాలు ప్రకటించాలి’ అని అన్నారు. బాంబులు లక్ష్యానికి దూరంగా జారవిడిచారని వచ్చిన వార్తల్ని ఖండించారు. అది నిజమైతే పాక్‌ అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తుందని ఆయన అన్నారు.

అభినందన్‌ ఫిట్‌గా ఉంటేనే..
పాకిస్తాన్‌ నిర్బంధం నుంచి విడుదలైన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాకే యుద్ధ విమానం నడుపుతారని ధనోవా చెప్పారు. కూలిపోయిన మిగ్‌ విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన అభినందన్‌కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, ఆయన మళ్లీ విమానం నడుపుతాడా? లేదా? అన్నది మెడికల్‌ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్‌ యుద్ధ విమానాలు సెప్టెంబర్‌ నాటికి వైమానిక దళానికి అందుతాయని చెప్పారు.

బాలాకోట్‌ దాడి సమయంలో రఫేల్‌ విమానాలు అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. పాకిస్తాన్‌ ఎఫ్‌–16 యుద్ధ విమానాల వాడకంపై అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందో తనకు తెలియదని, ఒకవేళ ఆ విమానాన్ని దాడులకు వాడొద్దని అందులో ఉంటే, ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్లేనని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ దాడుల్ని తిప్పికొట్టేందుకు వినియోగించిన మిగ్‌–21 విమానం అత్యంత అధునాతనమైనదని తెలిపారు.

పోఖ్రాన్‌లో ‘బాలాకోట్‌’కు రిహార్సల్‌!
పుల్వామాలో ఉగ్ర దాడి తరువాత ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రెండింటి మధ్య నిర్వహించిన సైనిక కసరత్తు కార్యక్రమంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులుబాసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తరువాత రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో ‘వాయుశక్తి’ పేరిట వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఉగ్రమూకలపై ప్రతీకారం తీసుకునేందుకు సన్నద్ధమయ్యేలా ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయుశక్తి కార్యక్రమం షెడ్యూల్‌ అంతకుముందే ఖరారైనా,  పుల్వామా ఘటనకు వైమానిక దళం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఐఏఎఫ్‌ అధికారులకు సమాచారం అందినట్లు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఒక రిహార్సల్‌లా ఉపయోగించుకుని పుల్వామా ఘటనకు కారణమైన జైషే మొహమ్మద్‌ ఉగ్ర సంస్థపై దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు రాగానే భారత్‌–పాక్‌ నియంత్రణ రేఖ అవతలి వైపున గగనతలంలో దాడులు నిర్వహించేలా వాయుశక్తి కార్యక్రమంలో మార్పులు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన సమయంలో ప్రతీకార చర్యకు దిగుతామని వైమానిక దళ చీఫ్‌ బీఎస్‌ ధనోవా ఈ సందర్భంగా ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

నాడు బాలాకోట్‌ శిబిరంలో 300 మొబైల్స్‌ యాక్టివ్‌
బాలాకోట్‌లో మృతి చెందిన ముష్కరులకు సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించాలని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ది నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌వో) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలాకోట్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగడానికి ముందు ఆ ప్రదేశంలో నిఘా ఉంచగా 300 మొబైల్‌ ఫోన్లు పనిచేస్తున్నట్టుగా తమకు సిగ్నల్స్‌ అందాయని, అంటే ఆ సమయంలో స్థావరంలో అందరు ఉగ్రవాదులు ఉన్నట్టుగా తమకు అర్థమైందని ఆ సంస్థ అధికారి  తెలిపారు.

‘ఫిబ్రవరి 26న భారత వాయుసేన నుంచి దాడులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి జల్లెడ పట్టాం. దాదాపుగా 300 మొబైల్స్‌ అక్కడ వాడుతున్నట్టుగా మాకు సిగ్నల్స్‌ అందాయి. ఇదే విషయాన్ని వైమానిక దళం దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో ఐఏఎఫ్‌ జవాన్లు మొదట ఆ ఫోన్‌ సిగ్నల్స్‌ని నాశనం చేశారు. ఆ తర్వాత వెయ్యి కేజీల బరువైన బాంబుల్ని ప్రయోగించారు’ అని ఆ అధికారి చెప్పారు. ‘దాడులకు ముందు ఎన్‌టీఆర్‌వో, భారత నిఘా కూడా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న సదుపాయాలపై ఒక అంచనాకు వచ్చింది. ఆ తర్వాతే దాడులకు దిగింది’ అని అధికారి వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top