కేరళ విలవిల

heavy rains in kerala, death toll rises to 114 - Sakshi

కొనసాగుతున్న జల ప్రళయం

24 గంటల్లో 106 మంది మృతి

ఈ సీజన్‌లో 324 మంది మృతి

శతాబ్దకాలంలో తీవ్ర విపత్తు

సహాయక శిబిరాల్లో 3 లక్షల మంది ప్రజలు

తిరువనంతపురం: పర్యాటక స్వర్గధామం కేరళ అతలాకుతలమైంది. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు, వరదలు రాష్ట్రంలో పెను విషాదాన్నే మిగిల్చాయి. వరదల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత నిరాశాజనకంగా మారింది. 24 గంటల వ్యవధిలో 106 మంది ప్రాణాలు కోల్పోవడం వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. శుక్రవారం సాయంత్రం మృతుల సంఖ్య 173కు పెరిగింది. మే 29 నుంచి రాష్ట్రంలో వర్ష సంబంధ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 324కు చేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

తాజా వరదల్లో ప్రతి జిల్లాలో మౌలిక వసతులు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు శతాబ్ద కాలంలో ఇంతటి పెను విపత్తును ఎరుగని కేరళ పర్యాటకం రూపంలో భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అయితే దెబ్బతిన్న రోడ్లు, కొండచరియలు వారి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తున్నాయి. నదులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాదకరంగానే ఉన్నాయి.

నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. పెట్రోల్‌ బంకుల్లో ఇంధన నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా, పాతనమ్‌తిట్టా, ఆలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్‌ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి కొచ్చి చేరుకున్న ప్రధాని మోదీ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.

మరో రెండ్రోజులు భారీ వర్షాలు
అలువా, కాలడీ, పెరుంబవూర్, మువాత్తుపుజా, చాలాకుడీ తదితర ప్రాంతాల్లో  మత్స్యకారులు కూడా తమ పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన వయానాడ్‌ జిల్లాకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు రైలు సేవలను రద్దు లేదా రీషెడ్యూల్‌ చేయగా, కొచ్చి మెట్రో సేవలు శుక్రవారం యథావిధిగా కొనసాగాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భీకర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

పాతనమ్‌తిట్టా, తిరువనంతపురం, కొల్లాం, ఆలపుజ్జా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో గంటకు 60 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అంచనావేసింది. మరోవైపు, విదేశాల్లో ఉన్న కేరళీయులు తమవారి క్షేమం కోసం పరితపిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న తమ కుటుంబీకులు, బంధువులను ఆదుకోవాలని టీవీల్లో అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు. ఆరేళ్ల బిడ్డతో వరదల్లో చిక్కుకున్న ఓ మహిళ..‘ఆహారం, నీరు లేదు. సాయం చేయండి..ప్లీజ్‌’ అని వేడుకుంటున్న వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా వ్యాపించింది.

ఆసుపత్రులు జలమయం.. రోగులకు అవస్థలు
ఎర్నాకులం జిల్లాలోని చాలా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఫలితంగా రోగులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సహాయక శిబిరాల్లోనూ ఆహారం, నీటికి కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. వరద ప్రభావం ఎక్కువగాలేని తిరువనంతపురం సహా కొన్ని జిల్లాల్లో పెట్రోల్‌ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయి.

తిరువనంతపురం జిల్లాలో కొన్ని పెట్రోల్‌ బంకుల ముందు వాహనదారులు క్యూలైన్లలో బారులుతీరారు. 3 వేల లీటర్ల డీజిల్, వేయి లీటర్ల పెట్రోల్‌ను రిజర్వులో ఉంచుకోవాలని అధికారులు అన్ని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలను సూచించారు. మరోవైపు, పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దేశీయ విమాన సంస్థలతో సమావేశమై ప్రయాణ చార్జీలు తగ్గించి కేరళకు అదనపు విమానాలను నడపాలని కోరింది.

మళ్లీ భేటీ అయిన ఎన్‌సీఎంసీ..
ఇప్పటి వరకు సుమారు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 44 మందిని కాపాడామని కేరళలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రకటించింది. కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టతరమవుతోందని తెలిపింది. ప్రస్తుతం 51 బృందాలు సేవలందిస్తున్నాయని, మరో రెండు బృందాలు త్వరలోనే అక్కడికి వెళ్తాయని ఢిల్లీలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) వరుసగా రెండోరోజు శుక్రవారం సమావేశమై కేరళలో వరద పరిస్థితిని సమీక్షించింది.

ఈ భేటీలో కేరళ, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. అదనపు వనరులను సమకూర్చుకోవాలని సహాయక చర్యలు చేపడుతున్న దళాలకు కమిటీ సూచించింది. ఇప్పటి వరకు కేంద్రం 339 మోటార్‌ పడవలు, 2800 లైఫ్‌ జాకెట్లు, 1400 తేలియాడే బెల్టులు, 27 లైట్‌ టవర్స్,  వేయి రెయిన్‌కోట్లు పంపించినట్లు ఎన్‌సీఎంసీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే లక్ష ఆహార పొట్లాలు పంపిణీచేశామని, మరో లక్ష పొట్లాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పాలపొడిని పంపేందుకు కూడా ఏర్పాట్లుచేశామని వెల్లడించారు. రైల్వే శాఖ 1.20 లక్షల నీటి సీసాలను పంపింది. మరో 1.20లక్షల బాటిళ్లను పంపేందుకు సిద్ధంగా ఉంచింది. సుమారు 3 లక్షల తాగునీటి బాటిళ్లతో ప్రత్యేక రైలు నేడు కాయంకుళం చేరుకోనుంది. కేరళకు 100 మెట్రిక్‌ టన్నుల ఆహారపదార్థాల పొట్లాలను పంపేందుకు శిశు, సంక్షేమ శాఖ వైమానిక దళం, కేరళ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇంతటి భారీస్థాయి వర్షాలు గతంలో పడిన సంవత్సరం 1924
వరద ముప్పులో ఉన్న జిల్లాలు : 13  
రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాలు : 9  
గేట్లు ఎత్తేసిన డ్యాంలు: 27
కొండచరియలు విరిగిపడుతున్న
ప్రాంతాలు: 211
ధ్వంసమైన రోడ్లు: 10,000 కి.మీ
దెబ్బతిన్న ఇళ్లు: సుమారు 20,000
ఆస్తినష్టం అంచనా: రూ.8316 కోట్లు
ఇడుక్కి డ్యాం నుంచి సెకన్‌కు విడుదలవుతోన్న నీరు: 15 లక్షల లీటర్లు
వరద సాయానికి కేటాయించిన ఓనం
నిధులు: రూ. 30 కోట్లు

శుక్రవారం రాష్ట్రంలో కాపాడింది: 80,000
ఆలువాలోనే: 71,000
నిరాశ్రయులు: 3,00,000
సహాయక శిబిరాలు: 2,000
సహాయక బృందాలు: 51

కేంద్రం పంపినవి..
మోటార్‌ పడవలు: 339
లైఫ్‌ జాకెట్లు: 2800
లైట్‌ టవర్స్‌: 27
రెయిన్‌కోట్లు: 1000
తేలియాడే బెల్టులు: 1400
ఆహార పొట్లాలు: 1,00,000
రైల్వేశాఖ ఇచ్చిన నీటి సీసాలు: 1,20,000


పాలక్కడ్‌లో కొండచరియలు విరిగిపడిన అనంతరం కొనసాగుతున్న సహాయకచర్యలు


ఇంటి పైకప్పు నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులు


కోజికోడ్‌లో వరదనీటిలో పెట్రోల్‌ పంప్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top