
భారత్‌లో కరోనా మరణాల రేటు తగ్గుదల
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల రేటు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్-19 మరణాల రేటు 3.3 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గిందని, అంతర్జాతీయంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. మహమ్మారి బారినపడి కోలుకునే వారిసంఖ్య 60,000 దాటడంతో రికవరీ రేటు 41.61 శాతానికి పెరిగిందని చెప్పారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ రేటు సంతృప్తికరంగా ఉందని అన్నారు. ప్రతి లక్ష మందిలో కేవలం 10.7 కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. ఇక కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,000కు చేరువవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,000 దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా టెస్టింగ్ సామర్ధ్యం పెరిగిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. రోజుకు 1.1 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, 612 ల్యాబ్‌ల్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.