కోవిడ్‌‌ మరణాలు: భారత్‌లో లక్ష మందిలో ఒకరు! | Health Ministry Says India Has 1 Covid Fatality Per 1 Lakh Population World 6 | Sakshi
Sakshi News home page

ప్రతీ లక్షమందిలో ఒక్కరు కరోనాతో మృతి!

Jun 24 2020 9:21 AM | Updated on Jun 24 2020 12:36 PM

Health Ministry Says India Has 1 Covid Fatality Per 1 Lakh Population World 6 - Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రతి లక్ష మంది జనాభాలో ఒక్కరు మాత్రమే కరోనా వైరస్ ‌(కోవిడ్‌-19) బారిన పడి మరణిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచ దేశాల్లో ఈ సగటు ఆరు రెట్లు(6.04) ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక ప్రకారం.. యూకేలో ప్రతీ లక్ష మందిలో 63.13, స్పెయిన్‌లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30, జర్మనీలో 27.32, బ్రెజిల్‌లో 23.68, రష్యాలో 5.62 కోవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఆయా దేశాలతో పోలిస్తే సరైన సమయంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిరంతర వైద్య పర్యవేక్షణ తదితర ప్రభుత్వ ముందస్తు చర్యల కారణంగానే దేశంలో మరణాల సంఖ్యను అదుపు చేయగలిగినట్లు తెలిపింది. (ఒక్క రోజులో 11వేల మంది డిశ్చార్జి)

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 2,48,189 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని.. రికవరీ రేటు 56.38 శాతంగా ఉందని పేర్కొంది. ఇక మంగళవారం నాటికి దేశంలో 14,933 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 312 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,40,215కు, మృతుల సంఖ్య 14,011కు చేరింది. ఇదిలా ఉండగా.. జూన్‌ 2 నాటికి భారత్‌లో ప్రతి లక్ష మందిలో 0.41 మంది కోవిడ్‌తో మృత్యువాత పడగా.. ప్రపంచవ్యాప్తంగా ఇది 4.9గా నమోదైంది.

ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కోవిడ్‌-19 పరీక్షల ల్యాబ్‌లను వెయ్యికి పెంచేందుకు నిర్ణయించింది. ఇందులో 730 ప్రభుత్వ ల్యాబ్‌లు, 270 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ విషయం గురించి ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బలరాం భార్గవ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు. కోవిడ్‌ వ్యాప్తి తొలినాళ్ల నుంచి 3Tలు అనగా.. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌పై దృష్టి సారించామని తద్వారా వైరస్‌పై యుద్ధానికి సన్నద్ధమయ్యామని తెలిపారు. దేశంలోని ప్రతీ జిల్లాలో కోవిడ్‌ ల్యాబ్‌ నెలకొల్పాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement