రాహుల్.. ప్రధాని అయిపోయారట! | Sakshi
Sakshi News home page

రాహుల్.. ప్రధాని అయిపోయారట!

Published Tue, Mar 28 2017 10:04 AM

రాహుల్.. ప్రధాని అయిపోయారట!

రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా చేద్దామంటేనే ఇంకా కుదరడం లేదు. అలాంటిది సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాత్రం ఏకంగా ఆయనను ప్రధానమంత్రిని చేసేశారు. ఆయన మంత్రివర్గంలో ఫలానా ఆయన పనిచేశారంటూ చెప్పేస్తున్నారు!! అవును.. వయసు మీద పడటంతో జ్ఞాపక శక్తి తగ్గుతోందో.. లేదా పదాలు తడబడుతున్నాయో తెలియదు గానీ ఆయన చేస్తున్న ట్వీట్లు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజ్‌కుమారీ రత్నాసింగ్ రూపొందించిన ఒక వీడియోను దిగ్విజయ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో తీసింది ఎవరో వివరించే ప్రయత్నంలో ఆయన తప్పులో కాలేశారు. రత్నాసింగ్ ఎవరో కాదని.. మాజీమంత్రి దినేష్ సింగ్ కూతురని చెబుతూ.. దినేష్ సింగ్ అనే పెద్దాయన గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ మంత్రివర్గాలలో పనిచేశారన్నారు. దినేష్ సింగ్ తండ్రి అవధ్ తాలూక్‌దార్లలో ఒకరని, ఆయన స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారితో పోరాడి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని కూడా చెప్పారు.

ఇందిరా గాంధీ అంటే ప్రధానమంత్రిగా పనిచేసిన విషయం అందరికీ తెలుసు గానీ.. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని అయ్యారో, ఆయన దగ్గర దినేష్ సింగ్ అనే మంత్రి ఎప్పుడు పనిచేశారో దిగ్విజయ్ సింగ్‌కే తెలియాలి. నిజానికి రాజీవ్ గాంధీ అని రాయబోతూ రాహుల్ గాంధీ అని రాసేశారీ పెద్దాయన. దినేష్ సింగ్ గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కూడా కేంద్రమంత్రిగా చేశారు. దిగ్విజయ్ సింగ్ మాట తడబడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అనబోయి.. భారత ఆక్రమిత కశ్మీర్ అనేశారు. అదికూడా రెండు దేశాల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో!! ఒసామా బిన్ లాడెన్‌ను 'ఒసామాజీ' అని, హఫీస్ సయీద్‌ను 'సాహెబ్' అని సంబోధించారు!!

 

Advertisement
Advertisement