మరిన్ని డోక్లామ్‌లకు సిద్ధమవ్వాల్సిందే

Have To Remain Prepared To Counter Doklam-Like Situation, Says Army Chief

సైనికులకు ఆర్మీ చీఫ్‌ రావత్‌ పిలుపు

జమ్మూ: భారత్‌–చైనా సరిహద్దులో భవిష్యత్‌లో డోక్లామ్‌ లాంటి ఉద్రిక్తతలు తలెత్తితే ఎదుర్కొనడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ పిలుపునిచ్చారు. పర్వత ప్రాంతాల్లో శత్రువుల్ని నిలువరించేందుకు, ఎదురుదాడి చేసేందుకు మోహరించే ‘17 కోర్‌’ను ప్రబల నిరోధక శక్తిగా మార్చే ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా 47వ ఆర్మర్డ్‌ రెజిమెంట్‌కు ‘ప్రెసిడెంట్‌ స్టాండర్డ్‌’ విశిష్ట గౌరవాన్ని అందజేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రావత్‌ సమాధానాలిచ్చారు.

17 కోర్‌ను చైనాను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘అలా అని ఎందుకు అనుకోవాలి? శత్రువుల చొరబాటును అడ్డుకోవడానికి, దేశ రక్షణకు ప్రమాదకరంగా మారే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని జవాబిచ్చారు. 2014 జనవరిలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ(రక్షణ) ‘17 కోర్‌’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 90,274 సైనికులతో 2021 నాటికి ఈ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కాగా, కశ్మీర్‌లోని యువతలో తీవ్రవాద భావజాలం పెంపొందడానికి సామాజిక మాధ్యమాలే కారణమని రావత్‌ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణా రేఖ(ఎల్వోసీ) వెంట పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top