ఏపీది వితండవాదం: హరీశ్ | harish rao fire on andhra pradesh in irrigation projects | Sakshi
Sakshi News home page

ఏపీది వితండవాదం: హరీశ్

Jun 23 2016 3:16 AM | Updated on Sep 4 2017 3:08 AM

ఏపీది వితండవాదం: హరీశ్

ఏపీది వితండవాదం: హరీశ్

కృష్ణా బోర్డుకు సంబంధించి రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో ఆంధ్రపదేశ్ ఎంతసేపటికీ అదే వితండ వాదం, విచిత్ర వైఖరి అవలంబిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

ఎవరి గేట్లు వాళ్లే నిర్వహించుకుంటారా?
అలాగైతే ప్రాజెక్టులెలా నడుస్తాయి?
వాటా కంటే ఏపీకి ఎక్కువ నీళ్లిచ్చాం
మాకు తక్కువొస్తున్నా సహకరిస్తున్నాం

 
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా బోర్డుకు సంబంధించి రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో ఆంధ్రపదేశ్ ఎంతసేపటికీ అదే వితండ వాదం, విచిత్ర వైఖరి అవలంబిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘‘కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి వైఖరితో ఏపీ ఏమీ తేల్చడం లేదు. దాంతో చర్చలు ముందుకు సాగడం లేదు’’ అన్నారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి సూచనలతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులం పరస్పరం సమావేశమైనా ఆ భేటీ కూడా అసమగ్రంగా, అస్పష్టంగా ముగిసిందని వివరించారు.

గురువారం ఉదయం తాము మళ్లీ భేటీ అవుతామన్నారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా నదుల అనుసంధానం జరగదని ఉమాభారతి హామీ ఇచ్చారన్నారు. ‘‘గోదావరిపై రెండు మూడు లింకుల అనుసంధాన ప్రతిపాదనలున్నాయి. అయితే గోదావరిపై తేల్చిన అంచనాలు 1980 నాటివి. ఈ 30 ఏళ్లలో నదిపై పలు కొత్త ప్రాజెక్టులొచ్చాయి. నీటి పరిమాణం తగ్గింది. కాబట్టి నీటి లభ్యతపై తాజా అంచనాలను రూపొందించాకే అనుసంధానం చేపట్టాలని చెప్పగా మంత్రి సమ్మతించారు’’ అని వివరించారు.

ఎవరి భూభాగంలో ఉన్న గేట్లను వారే నిర్వహించుకుంటామన్న ఏపీ వైఖరిని హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇది సరికాదు. నాగార్జునసాగర్ కుడి కాల్వను ఏపీకి ఇచ్చేయమనడం ఏం న్యాయం? ఎవరి గేట్లు వాళ్లు ఎత్తుకుంటే ఇక ప్రాజెక్టెలా నడుస్తుంది? పైగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు మరో 90 టీఎంసీలు రావాల్సి ఉంది. ఓవైపు మాకు తాగేందుకే నీళ్లు లేవంటుంటే వాళ్లేమో తాగునీరు పేరుతో మూడో పంటకు నీళ్లడుగుతున్నారు. గతేడాది వారికి 512 టీఎంసీల వాటా వస్తే, అదనంగా మరో 15 టీఎంసీలిచ్చాం. ఒకట్రెండు సందర్భాల్లో ప్రాజెక్టులో నీటి మట్టం నిర్వహణను చూసుకుంటూ నీళ్లు వదలడం వల్ల జాప్యమైందే తప్ప ఏ ఇబ్బందులూ కలగలేదు. కృష్ణా జలాల్లో మాకు 198 టీఎంసీలే వచ్చినా వారికి సహకరించాం. అయినా వారు రాద్ధాంతం చేస్తున్నారు.

కేంద్రంతో మేం చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నాం. కానీ కేంద్రం మాకు మొదటి నుంచీ అన్యాయమే చేస్తోంది. ఇప్పటికీ మేం సహకరిస్తాం. ఏపీలో కూడా రైతులు బాగుండాలని ఆశిస్తున్నాం. కానీ ఏకపక్షంగా చేయడం సరికాదు’’ అన్నారు. ‘‘ఎన్‌డబ్ల్యూడీఏపై ఈ రోజు ప్రత్యేక గవర్నింగ్ బాడీ భేటీ, వార్షిక సమావేశం జరిగాయి. ఎన్‌డబ్ల్యూడీఏ సొసైటీ నిబంధనల మార్పులను గవర్నింగ్ బాడీలో ఆమోదించారు. తద్వారా నాబార్డ్, ఇతర సంస్థల నుంచి ఈ సంస్థ రుణం తీసుకుని పీఎంకేఎస్‌వైలోని 99 ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు వీలవుతుంది. మేం కృష్ణా బోర్డు ఆదేశాలను అమలు చేస్తున్నామే తప్ప సొంతగా చేసేదేమీ ఉండదు’’ అని చెప్పారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు తేల్చేదాకా కృష్ణా బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ను నోటిఫై చేయరాదని డిమాండ్ చేశారు.
 
తెలంగాణది మొండి, తొండి వాదన: ఏపీ మంత్రి ఉమ
కేఆర్‌ఎంబీ ఏర్పాటవగానే అమల్లో ఉన్న ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆయా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ అన్నారు. తెలంగాణ తెలిసీ తెలియక మొండి, తొండి వాదన, పిడివాదం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వైఖరి అమానుషం. దుర్మార్గమని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టరాదన్నారు. ‘‘మీకు న్యాయవాదులు ఉన్నారు. న్యాయ సలహా తీసుకోండి. కే ఆర్‌ఎంబీ ముసాయిదా నోటిఫికేషన్‌ను నోటిఫై చేయనివ్వకుండా అడ్డుతగలడం న్యాయమా? మేం ఒక్క సాగర్ ప్రాజెక్టు నిర్వహణనే బోర్డు పరిధిలోకి తేవాలని కోరామనడం అబద్ధం. అంతా బాగుండాలనే కోరుతున్నాం. తెలంగాణకు చెందిన నీటి చుక్క కూడా మాకొద్దు. పోలవరం, పట్టిసీమ నిర్మిస్తే తెలంగాణకు మరో 90 టీఎంసీలివ్వాలనడం సరికాదు. దానిపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదు. మీరు కడుతున్న కొత్త ప్రాజె క్టుల సంగతి అపెక్స్ కౌన్సిల్లో తేలాలి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement