ట్రాయ్‌ చైర్మన్‌కు హ్యాకర్ల షాక్‌

Hacker Deposits Rs 1 In TRAI Chairman's Account To Improve - Sakshi

ఆయన ఖాతాలో రూ.1 డిపాజిట్‌ చేసిన హ్యాకర్లు

బెంగళూరు: దమ్ముంటే తన ఆధార్‌ను దుర్వినియోగం చేయాలని ట్విట్టర్‌లో సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మకు ఎథికల్‌ హ్యాకర్లు మరోసారి షాకిచ్చారు. శర్మకు ఏయే బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో బయటపెట్టిన హ్యాకర్లు.. రూ.1 చొప్పున ఆయన బ్యాంకు ఖాతాలోకి డిపాజిట్‌ చేశారు. ఈ చెల్లింపులను స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా శర్మ గత మూడేళ్లుగా ఓ హిందుత్వ వెబ్‌సైట్‌కు ఎస్బీఐ డెబిట్‌ కార్డ్‌ ద్వారా చెల్లిస్తున్న వివరాలను బయటపెట్టారు. లీలాధర్‌ ఆర్గానిక్స్‌ సంస్థ పేరుతో 2018, జూలై 2న సేంద్రీయ ఉత్పత్తుల్ని అమ్మిన విషయాన్ని సైతం శర్మ ఆధార్‌ కార్డు సాయంతో హ్యాకర్లు వెలుగులోకి తెచ్చారు. దీంతో హ్యాకర్లు ఇంటర్నెట్‌లో పోస్ట్‌చేసిన వివరాలు వైరల్‌గా మారిపోయాయి. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ సాయంతో భీమ్, పేటీమ్‌ యాప్‌ల ద్వారా వీరు శర్మ బ్యాంక్‌ అకౌంట్‌లోకి నగదును పంపారు.  

శ్రీకృష్ణ రిపోర్టుతో మొదలైన రగడ
ఇటీవల శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలో పౌరుల వ్యక్తిగత వివరాల పరిరక్షణకు ఆధార్‌ చట్టాన్ని సవరించాలని సూచించింది. దీంతో తెరపైకొచ్చిన శర్మ ఆధార్‌ వివరాలు అత్యంత సురక్షితమని స్పష్టం చేశారు. దమ్ముం టే తన ఆధార్‌ నంబర్‌ 7621 7768 2740ను దుర్వినియోగం చేసి చూపాలని సవాలు విసిరారు. దీంతో ఎథికల్‌ హ్యాకర్లు ఇలియట్‌ అల్డర్‌సన్, పుష్పేంద్ర సింగ్, అనివర్‌ అరవింద్, కరణ్‌ సైనీలు రంగంలోకి దిగారు. సింగ్‌కు సంబంధించిన ఈ–మెయిల్స్, అడ్రస్, ఫోన్‌ నంబర్లు, పాన్, పుట్టినరోజు, ఓటర్‌ ఐడీ, డీమ్యాట్‌ ఖాతా, ఎయిర్‌ఇండియా కేటాయించిన ఫ్రీక్వెంట్‌ ఫ్లయర్‌ ఐడీ సహా 14 వివరాలను బయటపెట్టారు. కానీ ఇవన్నీ గూగుల్‌లో లభ్యమవుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదివారం చెప్పింది. దీంతో అప్పటికప్పుడు ఆ సంస్థ డేటాబేస్‌ను హ్యాక్‌ చేసిన పుష్పేంద్ర సింగ్‌.. శర్మ ఆధార్‌కు అనుసంధానమైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అకౌంట్‌ బ్రాంచ్‌ పేరు, కోడ్‌ తదితర వివరాలను బయటపెట్టి షాకిచ్చాడు. మరోవైపు శర్మకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, కొటక్‌ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖా తాలున్నట్లు హ్యాకర్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హ్యాకర్లు శర్మ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలోకి రూ.1 డిపాజిట్‌ చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top