జీఎస్టీ బొనాంజా.. | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బొనాంజా..

Published Sun, Jul 22 2018 1:50 AM

gst council meet on good news - Sakshi

న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి మరోసారి తీపి కబురు చెప్పింది. వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు (27 అంగుళాలు, అంతకంటే చిన్నవి) సహా వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే శానిటరీ న్యాప్కిన్లపై పన్నును పూర్తిగా ఎత్తివేసి దాదాపు ఏడాది కాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చింది. మొత్తం 88 రకాల వస్తువులపై పన్ను రేట్లను తగ్గించినట్లు కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారు. కొత్త పన్ను రేట్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. గోయల్‌ అధ్యక్షతన జీఎస్టీ మండలి 28వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది.

జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసే విధానంలో వ్యాపారులకు జీఎస్టీ మండలి కొంత సడలింపునిచ్చింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న వాణిజ్య సంస్థలు ప్రస్తుతం ప్రతి నెలా రిటర్నులు దాఖలు చేస్తుండగా, వారు ఇకముందు మూడు నెలలకోసారి మాత్రమే రిటర్నులు సమర్పిచేలా విధానాన్ని సరళీకరించింది. పన్నులు మాత్రం ప్రతి నెలా కట్టాల్సిందే. దీనివల్ల 93 శాతం మంది వ్యాపారులు, చిన్న వాణిజ్య సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనీ, అయితే కొత్త విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని గోయల్‌ చెప్పారు. కాగా, గుజరాత్‌ ఎన్నికలకు ముందు గతేడాది నవంబరులోనూ 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్ను రేటును తగ్గించడం తెలిసిందే.

ఆదాయం తగ్గడంపై చింత లేదు
పన్ను రేటు తగ్గడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం గురించి పట్టించుకోకుండా, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని జీఎస్టీ మండలి నిర్ణయించిందని గోయల్‌ చెప్పారు. తాజా రేట్ల తగ్గింపుతో ప్రభుత్వానికి ఏడాదికి 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ విషయాన్ని ప్రస్తావించగా, రిటర్నుల దాఖలును సరళీకరించినందున మరింత ఎక్కువ మంది పన్నులు కడతారనీ, ఆదాయం తగ్గినా ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ‘ఈరోజు సమావేశంలో అనేక నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నాం. సరళీకరణ, హేతుబద్ధీకరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. మొత్తం 88 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాం’ అని గోయల్‌ చెప్పారు.

కేంద్ర మంత్రి జైట్లీ ఓ ట్వీట్‌ చేస్తూ ఇక 28 శాతం పన్ను శ్లాబులో కొన్ని ఉత్పత్తులే మిగిలాయనీ, ఉత్పాదకత పెరగడానికి పన్ను రేట్ల తగ్గింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఉద్దేశించిన ఆర్‌సీఎం (రివర్స్‌ చార్జ్‌ మెకానిజం) అమలును వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కాంపొజిషన్‌ పథకం పరిమితిని రూ. 1.5 కోటికి పెంచడం సహా జీఎస్టీ చట్టంలో మొత్తం 40 సవరణలకు  ఆమోదం తెలిపింది. జీఎస్టీ మండలి 29వ సమావేశం ఆగస్టు 4న జరగనుంది. ఎంఎస్‌ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రూపే, భీమ్‌ యాప్‌ ద్వారా చేసే చెల్లింపులకు ప్రోత్సాహకాలు తదితరాలను ఆ భేటీలో చర్చించనున్నారు.

రేట్లు తగ్గనున్న వస్తువులు
28 శాతం నుంచి 18 శాతానికి తగ్గేవి
► వాషింగ్‌ మెషీన్లు    
► రిఫ్రిజిరేటర్లు    
► టీవీలు (27 అంగుళాలు, అంతకంటే చిన్నవి)
► విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు    
► వీడియో గేమ్స్‌ పరికరాలు    
► వ్యాక్యూమ్‌ క్లీనర్లు    
► లారీలు, ట్రక్కుల వెనుక ఉండే కంటెయినర్లు    
► జ్యూసర్‌ మిక్సర్లు, గ్రైండర్లు    
► షేవింగ్‌ పరికరాలు    
► హెయిర్, హ్యాండ్‌ డ్రయ్యర్లు    
► వాటర్‌ కూలర్లు, స్టోరేజ్‌ వాటర్‌ హీటర్లు    
► పెయింట్లు, వాల్‌పుట్టీలు, వార్నిష్‌లు    
► లిథియం–అయాన్‌ బ్యాటరీలు    
►  పర్ఫ్యూమ్‌లు, టాయిలెట్‌ స్ప్రేలు


18 శాతం నుంచి 5 శాతానికి తగ్గేవి
► ఇథనాల్‌
► పాదరక్షలు (రూ. 500–1,000 ధరలోనివి)
► ఈ–పుస్తకాలు
► శానిటరీ న్యాప్కిన్లు (ప్రస్తుతం 12 శాతం),     పోషకాలు కలిపిన పాలు (ప్రస్తుతం 18 శాతం), స్మారక నాణేలపై పన్నును పూర్తిగా ఎత్తివేశారు.
► హోటళ్లలో రూములు తీసుకున్నప్పుడు బిల్లు రూ. 7,500 కన్నా ఎక్కువ ఉంటే 28 శాతం, రూ. 2,500–రూ.7,500 మధ్య ఉంటే 18 శాతం, రూ. 1,000–రూ. 2,500 మధ్య ఉంటే 12 శాతం పన్ను వర్తిస్తుంది.
► హస్తకళతో తయారైన చిన్న వస్తువులు, రాతి, చెక్క, పాలరాతితో తయారైన విగ్రహాలు, రాఖీలు, చీపురు కట్టలు, చెట్టు ఆకుల నుంచి తయారైన విస్తర్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు.
► హ్యాండ్‌ బ్యాగులు, నగలు దాచుకునే పెట్టెలు, ఆభరణాల వంటి ఫ్రేమ్‌ కలిగిన అద్దాలు, చేతితో తయారైన ల్యాంపులపై పన్ను రేటు 12 శాతానికి తగ్గింది.
► వెయ్యి రూపాయల లోపు విలువైన అల్లిక వస్తువులపై పన్ను 5 శాతానికి తగ్గింపు 

Advertisement

తప్పక చదవండి

Advertisement