నమో బాటలోనే కాంగ్రెస్‌ యాప్‌..

French Hacker Shows Congress App May Be Leaking Data Too - Sakshi

సాక్షి, పాట్నా :  ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నమో యాప్‌ యూజర్ల అనుమతి లేకుండానే వారి డేటాను అమెరికన్‌ కంపెనీకి పంపుతోందని ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ఎలియట్‌ అల్డర్‌సన్‌ ఆరోపించిన క్రమంలో తాజాగా కాంగ్రెస్‌ యాప్‌ సైతం సింగపూర్‌లోని ఓ కంపెనీకి సమాచారాన్ని చేరవేస్తోందని సంకేతాలు పంపారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కాంగ్రెస్‌ అధికారిక యాప్‌ ద్వారా సభ్యత్వానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి వ్యక్తిగత వివరాలు పార్టీ సభ్యత్వ ఆన్‌లైన్‌ పేజ్‌కు హెచ్‌టీటీపీ ద్వారా వెళతాయని అల్డర్‌సన్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ మెంబర్‌షిప్‌ పేజ్‌ ఐపీ అడ్రస్‌ సింగపూర్‌లోని ఓ సర్వర్‌కు అనుసంధానమైందని చెప్పుకొచ్చారు.

అల్డర్‌సన్‌ ట్వీట్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ తీరును పలువురు ట్విటర్‌ యూజర్లు తప్పుపట్టారు. మరోవైపు వేరొక దేశంలో సర్వర్లు ఉన్నంతమాత్రాన డేటా లీకవుతుందనేందుకు వీలులేదని మరికొందరు చెబుతున్నారు. రాజకీయ కోణంలోనే అల్డర్‌సన్‌ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలను ప్రజల ముందుంచేందుకే తన ప్రయత్నమని ఇందులో తనకెలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఫ్రెంచ్‌ హ్యాకర్‌ అల్డర్‌సన్‌ చెప్పుకొచ్చారు.

 కాగా, ఐఎన్‌సీ అధికారిక యాప్‌లో భద్రతా లోపాలపై ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ట్వీట్‌ చేసిన గంటకే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తన యాప్‌ను కాంగ్రెస్‌ తొలగించింది. మరోవైపు కాంగ్రెస్‌ యాప్‌ను తొలగించడంపై బీజేపీ స్పందించింది. నమోయాప్‌ను డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ చివరకు కాంగ్రెస్‌ యాప్‌నే తొలగించారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top