కూలిన ‘కసబ్‌’ బ్రిడ్జి

Foot overbridge collapses in Mumbai - Sakshi

ఆరుగురు మృతి 31 మందికి గాయాలు

ముంబైలోని సీఎస్‌టీ ప్రాంతంలో దుర్ఘటన

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌

ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన మహారాష్ట్ర సర్కారు  

సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌(సీఎస్‌టీ) నుంచి అంజుమన్‌ కాలేజీ,  టైమ్స్‌ ఆప్‌ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

రద్దీగా ఉండగా కుప్పకూలిన వంతెన
ముంబైలోని సీఎస్‌టీ నుంచి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్‌ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ముంబైలో గురువారం విధులు ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు.

దీంతో పాదచారుల హాహాకారాలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్‌ షిరాద్‌ ఖాన్‌(32), టి.సింగ్‌(35)గా గుర్తించారు. ఇంకొకరి వివరాలు తెల్సియాల్సి ఉంది. ముంబైలో ఇలాంటి ప్రమాదాలు కొత్తకాదు. 2017, సెప్టెంబర్‌ 29న ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వే బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 23 మంది చనిపోయారు. అలాగే 2018, జూలై 3న అంధేరీ ప్రాంతంలోని 40 ఏళ్ల పాతదైన గోఖలే పాదచారుల వంతెన కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.

భారీగా స్తంభించిన ట్రాఫిక్‌..
సీఎస్‌టీ మార్గంలో పాదచారుల బ్రిడ్జి కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ సందర్భంగా డీఎన్‌ రోడ్డు, జేజే ఫ్లైఓవర్‌ మీదుగా రాకపోకలు సాగించవద్దని వాహనదారులకు సూచించారు. ఇక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు సాగుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మృతులకు రూ.5 లక్షల పరిహారం..
ముంబై దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 పరిహారం అందజేస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై బృహన్‌ ముంబై కార్పొరేషన్,  రైల్వేశాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయన్నారు.

కాపాడిన రెడ్‌ సిగ్నల్‌
కసబ్‌ బ్రిడ్జి దుర్ఘటనలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ భారీగా ప్రాణనష్టాన్ని నివారించింది. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కూలిపోవడానికి కొద్దినిమిషాల ముందు ఎరుపురంగు ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. దీంతో సీఎస్‌టీ రైల్వేస్టేషన్‌ సమీపం నుంచి ఇళ్లకు వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. మరికాసేపట్లో సిగ్నల్‌ మారబోతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా బ్రిడ్జి కింద ఎవరూ లేకపోకపోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. ఈ విషయమై ఓ వాహనదారుడు మాట్లాడుతూ..‘రెడ్‌ సిగ్నల్‌ పడటంతో మేమంతా ఇళ్లకు వెళ్లేందుకు అసహనంగా ఎదురుచూస్తున్నాం. ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఆకుపచ్చ రంగులోకి మారకముందే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఒకవేళ అప్పుడు వాహనాలు ఈ మార్గంలో వెళుతుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది’ అని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి స్పందిస్తూ.. గురువారం ఉదయమే ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారనీ, అంతలోనే రాకపోకలకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top