breaking news
cst station
-
ఈ ఘోరానికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై నగరంలో గత రెండేళ్ల కాలంలో ఆరు రైల్వే వంతెనలు కూలిపోయాయి. వాటిలో మూడు వంతెనల ప్రమాదాల్లో పలువురు ప్రయాణికులు మరణించారు. గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతెనపై ఓ భాగం హఠాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు మరణించడం, 30 మంది గాయపడడం తెల్సిందే. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన పరిస్థితి ఎలా ఉందో అన్న విషయమై ‘బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ ఆరు నెలల క్రితమే అధ్యయనం జరిపి ‘ఇప్పట్లో ఈ వంతెనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ప్రయాణికులు ఈ వంతెనను నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు’ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. (కూలిన ‘కసబ్’ బ్రిడ్జి) ఇప్పుడు ఈ వంతెన కూలినందుకు ‘మీరు బాధ్యులంటే మీరు బాధ్యులు’ అంటూ స్థానిక రైల్వే సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది నిందలు వేసుకుంటున్నారు. ‘వంతెన నిర్వహణ బాధ్యత మీదంటే మీదే కనుక మీరే బాద్యులు’ ఇరు వర్గాలు దూషించుకుంటుంటే, మరోపక్క వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదంటూ మున్సిపాలిటీ ఎలా ‘ఆడిట్ సర్టిఫికెట్’ ఇచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని ప్రమాదాలు జరిగి ఇంత మంది చనిపోయినా పాలకులకు బుద్ధి రాలేదా? అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, మున్సిపాలిటీపై బిజేపీ మిత్రపక్షమైన శివసేన ఆధిపత్యం కొనసాగుతున్న విశయం తెల్సిందే. ఈ వంతెనల ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేవలం 18 నెలల క్రితమే పరేల్స్ ప్రతిభాదేవి రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రయాణికులు మరణించారు. ఆ తర్వాత జూలై మూడవ తేదీన అంధేరి రైల్వేస్టేషన్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే పొడువైన వంతెనలో ఓ భాగం కూలిపోగా ఓ మహిళ మరణించారు. దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పురాతన వంతెనల మరమ్మతులను ఎందుకు చేపట్టడం లేదని సోషల్ మీడియా తీవ్రంగా నిలదీసింది. ముఖ్యంగా బీజేపీ అధికార ప్రతినిధి సంజూ వర్మ ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వంతెన ప్రమాదం ‘ప్రకృతి వైపరీత్యం’గా అభివర్ణించడాన్ని, కూలిపోవడంలో పాదాచారుల తప్పిదం ఉందనడాన్ని మరింత ఎండగట్టింది. సంజూ వర్మ సిగ్గూ శరం ఉందా ? అంటూ విమర్శించింది. ‘ఇంకా నయం జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడని చెప్పలేదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. -
కూలిన ‘కసబ్’ బ్రిడ్జి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రద్దీగా ఉండగా కుప్పకూలిన వంతెన ముంబైలోని సీఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ముంబైలో గురువారం విధులు ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పాదచారుల హాహాకారాలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్ షిరాద్ ఖాన్(32), టి.సింగ్(35)గా గుర్తించారు. ఇంకొకరి వివరాలు తెల్సియాల్సి ఉంది. ముంబైలో ఇలాంటి ప్రమాదాలు కొత్తకాదు. 2017, సెప్టెంబర్ 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 23 మంది చనిపోయారు. అలాగే 2018, జూలై 3న అంధేరీ ప్రాంతంలోని 40 ఏళ్ల పాతదైన గోఖలే పాదచారుల వంతెన కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.. సీఎస్టీ మార్గంలో పాదచారుల బ్రిడ్జి కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ సందర్భంగా డీఎన్ రోడ్డు, జేజే ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించవద్దని వాహనదారులకు సూచించారు. ఇక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు సాగుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతులకు రూ.5 లక్షల పరిహారం.. ముంబై దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 పరిహారం అందజేస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై బృహన్ ముంబై కార్పొరేషన్, రైల్వేశాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయన్నారు. కాపాడిన రెడ్ సిగ్నల్ కసబ్ బ్రిడ్జి దుర్ఘటనలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ భారీగా ప్రాణనష్టాన్ని నివారించింది. ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిపోవడానికి కొద్దినిమిషాల ముందు ఎరుపురంగు ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో సీఎస్టీ రైల్వేస్టేషన్ సమీపం నుంచి ఇళ్లకు వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. మరికాసేపట్లో సిగ్నల్ మారబోతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా బ్రిడ్జి కింద ఎవరూ లేకపోకపోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. ఈ విషయమై ఓ వాహనదారుడు మాట్లాడుతూ..‘రెడ్ సిగ్నల్ పడటంతో మేమంతా ఇళ్లకు వెళ్లేందుకు అసహనంగా ఎదురుచూస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగులోకి మారకముందే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఒకవేళ అప్పుడు వాహనాలు ఈ మార్గంలో వెళుతుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది’ అని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి స్పందిస్తూ.. గురువారం ఉదయమే ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారనీ, అంతలోనే రాకపోకలకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు 'మహారాజ' హోదా
మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి, అక్కడి సీఎస్టీ స్టేషన్‌కు 'మహారాజ' హోదా లభిస్తోంది. ఇక మీదట ఆ విమానాశ్రయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు. చరిత్రాత్మక సీఎస్టీ రైల్వే స్టేషన్‌ను ఇకపై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అంటారు. ఈ రెండు సంస్థలకు పేర్లు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరాఠా వీరుడైన శివాజీకి మరింత గౌరవం ఇవ్వాలని, అందుకే కేవలం ఛత్రపతి శివాజీ అని వదిలేయకుండా మహారాజ అని తగలించాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేర్ల మార్పు నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.