‘ఆహా’ర్యం.. మాటే మంత్రం..

Expert analysis on  ivanka trump Signature - Sakshi

అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా ట్రంప్‌ 

ఆమె మాటతీరు, వస్త్రధారణ, సంతకంపై నిపుణుల విశ్లేషణ

సాక్షి, హైదరాబాద్‌: అందం, ఆహార్యంతోనే కాదు.. మాట్లాడే తీరులోనూ ఇవాంకా ట్రంప్‌ అదరహో అనిపించింది. ఆత్మ విశ్వాసాన్ని ప్రతి బింబిస్తున్న నడకతో, ముఖ్యంగా మోముపై చెరగని చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో సదస్సుకు వచ్చినవారంతా ఆమెకు అభిమాను లైపోయారు. ఈ నేపథ్యంలో ఇవాంకా మాట తీరు, సంతకం, వస్త్రధారణలను హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు విశ్లేషించారు.

ఆ మాటే మంత్రం...
‘‘చెప్పే విషయాన్ని సరిగా ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్టే అనేది పబ్లిక్‌ స్పీకింగ్‌లో ఒక ప్రాథమిక సూత్రం. ఇవాంకా తన ప్రసంగం ప్రారంభంలోనే అందరి మనసులనూ హత్తుకున్నారు. అంతే అద్భుతంగా చివరి వరకూ ప్రసంగాన్ని కొనసాగించారు. ‘హలో ఎవ్రీవన్‌.. థాంక్యూ బీయింగ్‌ హియర్‌ అండ్‌ ఫర్‌ ఇన్‌క్రెడిబుల్లీ వార్మ్‌ వెల్‌కమ్‌ (అందరికీ నమస్కారం.. సుస్వాగతం. ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది)’ అంటూ ఇవాంకా పలకరించిన తీరు ఆకట్టుకుంది. భారత్‌ శక్తి సామర్థ్యాలను ప్రస్తుతిస్తూ.. ఇరు దేశాల మధ్య అనుబంధాలను వివరిస్తూ ప్రతీ పదం స్పష్టంగా పలికారు. చెరగని చిరునవ్వుతో సరైన పదాలను వినియోగిస్తూ అందరికీ కనెక్టయ్యారు. సత్య నాదెళ్ల వంటి తెలుగువారిని, టీ–హబ్, సిటీ ఆఫ్‌ పెరల్స్‌ను ప్రస్తావిం చారు. ఆమె ఆహార్యం, నేరుగా అందరి వైపూ చూస్తూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి.  ఆమె ఒక మంచి వక్త అనిపించింది. అవసరాలకు అనుగుణంగా పదాల మధ్య ఇచ్చిన విరామాలు, మధ్య మధ్యలో ‘థాంక్యూ’లు ఆహూతులను కట్టిపడేస్తాయి. ‘దిస్‌ ఈజ్‌ ది ఫ్యూచర్‌.. వి కెన్, విల్‌ అండ్‌ మస్ట్‌ బిల్డ్‌ టుగెదర్‌ అండ్‌ దిస్‌ ప్రామిస్‌’ అనే వాక్యంతో ఇవాంకా ప్రసంగాన్ని ముగించారు.’’    
– డి.రామచంద్రం, వ్యక్తిత్వ వికాస నిపుణుడు

అది విజయానికి ‘సంతకం’..
‘‘ఇవాంకాది అసాధారణ వ్యక్తిత్వం. దీనికి ప్రతీక ఆమె సంతకమే. ఆ సంతకం యాంగిల్‌ అండ్‌ రౌండెడ్‌ (ఓ వైపు వంగినట్లుగా ఉండి గుండ్రంగా)గా ఉంది. ఆమెలో బిజినెస్‌ సెన్స్‌ అద్భుతమని దీని అర్థం. అలాగే సంతకంలో ‘కంటిన్యూయస్‌ ఫ్లో, కనెక్టింగ్‌ లెటర్స్‌ (ఒకదానిని ఒకటి తాకుతూ అక్షరం వెంటే అక్షరం ఉండటం)’ విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణిని పట్టిస్తుంది.  సంతకంలో లోయర్‌ జోన్‌ అక్షరాలు మానసికంగా, శారీరకంగా సమర్థవం తమైన స్థాయిని (హైఎనర్జీ లెవల్స్‌ను) సూచిస్తున్నాయి. చివరి అక్షరం రాసిన తీరు ఆమె స్వతంత్ర భావాలకు నిదర్శనం. సంతకంలో ఫ్రీఫ్లో ఆఫ్‌ స్ట్రోక్స్‌ వ్యాపారంలో దూరదృష్టికి, సంతకం కింద ఉన్న పెద్ద సర్కిల్‌ భావోద్వేగాలకు, సెంటిమెంట్స్‌కు, సంతకంలో పొడవాటి స్ట్రోక్స్‌ (అక్షరాలు) సృజనాత్మకతకు, స్ఫూర్తిదాయక లక్షణాలకు, కొత్త విషయాల పట్ల చూపే ఉత్సాహానికి నిదర్శనాలు. ఆమె ప్రేమాస్పదురాలు కూడా. అప్పుడప్పుడు తొం దరగా స్పందించడం, వేగంగా మూడ్‌ మారి పోయే లక్షణం ఉండే అవకాశముంది.    
– రణధీర్‌ కుమార్, సిగ్నేచర్‌ అనలిస్ట్‌

వైవిధ్యాన్ని గుర్తు చేసేలా..
‘‘విమానాశ్రయంలో దిగిన ప్పుడు ఇవాంకా ధరించిన దుస్తులు సెమీ ఫార్మల్‌. రౌండ్‌నెక్‌ టీషర్ట్‌పై నలుపురంగు ట్రౌజర్‌ను కాంబినేషన్‌గా ధరించారు. దానిపై బ్లాక్‌ అండ్‌ వైట్‌ బ్లేజర్‌ వేసుకున్నారు. దానిపై ఏకరూపత కలిగిన డిజైన్లు (సిమ్మెట్రికల్‌ ప్యాట్రన్స్‌) ఉన్నాయి. తన కన్నా ఉన్నత స్థాయి వారిని, సీనియర్లను కలవడానికి వెళ్లినప్పుడుగానీ.. లంచ్‌ లేదా తేనీటి విందు వంటి సందర్భాల్లో వీటిని ధరిస్తారు. ఇక ఇవాంకా హెచ్‌ఐసీసీలో సదస్సు జరుగుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు.. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చేవారికి కలుస్తున్న విషయాన్ని గుర్తు చేసేలా వస్త్రాలను ధరించారు. పూల డిజైన్లను ముద్రించిన కూల్‌ కలర్‌ గౌన్‌ను వేసుకున్నారు. (సాధారణంగా గ్రీన్, లెమన్‌ ఎల్లో, లైట్‌ పింక్‌ తదితర వాటర్‌ కలర్స్‌ను ఫ్యాషన్‌ పరిభాషలో కూల్‌ కలర్స్‌ అంటారు). అంతేగాకుండా ఈ డ్రెస్‌లో హైదరాబాదీలకు బాగా నచ్చే ఆకుపచ్చ, పసుపు రంగులకు ఆమె ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తోంది..’’
– సంతోష్‌కుమార్, ఫ్యాషన్‌ డిజైనర్‌

రావమ్మా.. ఇవాంకా!
సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్‌ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్‌ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్‌ ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్‌ ద్వారా 3.14 గంటలకు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్‌ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్‌ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్‌ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్‌ఐసీసీ చేరుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top