
ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం
వ్యక్తిగతంగా కొనాలంటే 10 లక్షల డాలర్లు
ఉద్యోగుల కోసం సంస్థ కొనాలంటే 20 లక్షల డాలర్లు
అమెరికాలో శాశ్వత స్థిరనివాసానికి బాటలువేసే ఖరీదైన కార్డ్
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత స్థిరనివాసానికి బాటలువేసే అత్యంత ఖరీదైన ‘గోల్డ్ కార్డ్’పథకానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఎవరైనా 10 లక్షల డాలర్లు చెల్లించి ఈ గోల్డ్‌కార్డ్‌ను తమ వశంచేసుకోవచ్చు. ఎంచక్కా అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవచ్చు. తమ సంస్థ పురోభివృద్ధికి అక్కరకొస్తారని భావించే అత్యంత నైపుణ్యమున్న సిబ్బంది, ఉన్నతాధికారులను అమెరికాకు తీసుకురావాలని భావించే కార్పొరేట్ సంస్థలు మాత్రం ఒక్కో వ్యక్తి కోసం 20 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈమేరకు అమెరికా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వును రూపొందించగా దానిపై ట్రంప్ సంతకం చేశారు. ద్రవ్యలోటును తగ్గిస్తూ అమెరికా ఖజానాకు వందల కోట్ల డాలర్లను జమచేసే ఈ కీలక పథకాన్ని స్వయంగా ట్రంప్ రూపొందించారని తెలుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న పెట్టుబడి వీసా(ఈబీ–5)కి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్‌ను తాజాగా తీసుకొచ్చారు.
హెచ్–1వీ వీసాదారులు మొదలు ఎలాంటి వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవాళ్లయినా నేరుగా అమెరికా స్థిరనివాసం కావాలంటే ఈ గోల్డ్‌కార్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ప్రపంచంలోని ఏ దేశంలోని సంపన్నులైనా అమెరికాలో శాశ్వత స్థిరనివాస హోదా సంపాదించాలంటే వీసా పొంది తర్వాత గ్రీన్‌కార్డ్ కోసం ఆతర్వాత పౌరసత్వం కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి సంపన్నులు, లక్షల డాలర్లు గుమ్మరించే స్తోమత ఉన్న ఉన్నతాధికారుల కోసమే ప్రత్యేకంగా ఈ గోల్డ్‌కార్డ్‌ను అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఖజానాకు ఆదాయ వరద
కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశాక ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గోల్డ్‌కార్డ్ సాయంతో ఇకపై మేం వందల కోట్ల డాలర్లను ఒడిసిపట్టబోతున్నాం. ఖజానాకు గోల్డ్‌కార్డ్ ఆదాయ వరదను పారించనుంది. తమకు అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు, నిపుణులు అనుకున్న వాళ్లను కంపెనీలు ఈ గోల్డ్‌కార్డ్‌తో అమెరికాకు రప్పించుకోవచ్చు. గోల్డ్‌కార్డ్ అనేది నిజంగా అత్యద్భుతం.
ఈ కార్డ్‌ల విక్రయాలతో వచ్చే నగదుతో మా ద్రవ్యలోటు భారం తగ్గిపోతుంది. ఖజానా నిండిపోతే మేం పన్నులు కూడా తగ్గిస్తాం. అప్పుల గుదిబండను కాస్తంత దించుకుంటాం. గోల్డ్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అడిగిన ప్రతి డాక్యుమెంట్‌ను సమయానికి ఇవ్వాలి. కార్డ్ మంజూరైతే 10 లక్షల డాలర్లను ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అమెరికాకు ప్రయోజనం చేకూరేలా మసలుకుంటామని మాటివ్వాలి’’అని ట్రంప్ చెప్పారు.
‘‘కార్డ్ పొందిన వాళ్లు చట్టబద్ధ శాశ్వత స్థిరనివాస హోదా పొందేందుకు అర్హత సాధిస్తారు. వీసా అందుబాటులో ఉంటుంది. గోల్డ్‌కార్డ్‌దారులు ఇచ్చే 10 లక్షల డాలర్లను వాణిజ్యమంత్రి ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు. ఈ నగదును అమెరికా వాణిజ్యం, దేశీయ పారిశ్రామికాభివృద్ధి కోసం ఖర్చుపెడతారు.
అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న పెట్టుబడిదారులు, అంకుర సంస్థల అధినేతలు, నైపుణ్య సిబ్బందికి గోల్డ్‌కార్డ్ సులువైన చక్కటి మార్గం’’అని ట్రంప్ అన్నారు. పౌరసత్వానికి గోల్డ్‌కార్డ్ అనేది సుగమం చేస్తుందని గతంలో వాణిజ్యమంత్రి హోవర్డ్ లుట్నిక్ అన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా అనే తేడాలేకుండా లక్షలు చెల్లించే ఏ దేశ పౌరునికైనా ఈ కార్డ్‌ను అమెరికా విక్రయించి స్థిరనివాసానికి సాదరస్వాగతం పలుకుతోంది. ట్రంప్ నిర్ణయంతో సంపన్న భారతీయులకు వేగంగా యూఎస్ పౌరసత్వం లభించే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. కార్డ్ వస్తే వెంటనే పౌరసత్వం ఇచ్చినట్లుగా భావించకూడదని ప్రభుత్వం గతంలోనే స్పష్టంచేసింది.