తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
చెన్నై: తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు తాజాగా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదంటూ జాతీయ ఎన్నికల సంఘాన్ని పన్నీర్ సెల్వం తరఫున ఎంపీ వి. మైత్రేయన్ ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు శనివారం అసెంబ్లీలో జరిగే బల నిరూపణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
( చదవండి : శశికళ ఎన్నికపై ఈసీకి ఫిర్యాదు )
జైలుకు వెళ్లే కొద్ది గంటల ముందు శశికళ దినకరన్‌ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. దీంతో ఎలాగైనా పార్టీని శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని పన్నీర్ సెల్వం ప్రతిన బూనారు. చిన్నమ్మకు వ్యతిరేకంగా పన్నీర్ వర్గం ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.