భారత పర్యటన విజయవంతం: ట్రంప్‌

Donald Trump Addresses Media In US Embassy In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని... ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్‌ హౌజ్‌లో చర్చలు జరిపిన అనంతరం ట్రంప్‌.. ఢిల్లీలో ఉన్న అమెరికా ఎంబసీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. భారత పర్యటనకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమెరికా నుంచి భారత్‌ కొనుగోళ్లు జరపడం మంచి విషయమని.. భారత పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 గురించి ట్రంప్‌ మాట్లాడుతూ... వైరస్‌ను రూపుమాపేందుకు చైనా ఎంతో కఠినంగా శ్రమిస్తోందని తెలిపారు.(భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్‌)

ఈ విషయం గురించి తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక గత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ వచ్చినందు వల్ల అమెరికాలో పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం సాధ్యమైందని ట్రంప్ తెలిపారు. డెమొక్రాట్లు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ప్రస్తుతం తాము అధికారంలోకి వస్తేనే స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటాయని పేర్కొన్నారు.  హెల్త్‌కేర్‌, మిలిటరీ, ఉద్యోగాల విషయంలో తాము మెరుగైన ఫలితాలు రాబట్టామని తెలిపారు. తాము కఠినంగా వ్యవహరించడం వల్లే అమెరికాలో ప్రతీ పౌరుడు సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు. (ట్రంప్‌ నోట పాకిస్తాన్‌.. జస్ట్‌ నాలుగుసార్లే!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top