'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే' | Diamond Trader in Gujarat Hosts Mass Wedding For 151 Couples | Sakshi
Sakshi News home page

'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే'

Dec 7 2015 10:52 AM | Updated on Sep 3 2017 1:38 PM

'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే'

'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే'

సూరత్లో ఆదివారం 151 జంటలు మూడుముళ్ల బంధంలో ఒక్కటయ్యారు.

సూరత్: సూరత్లో ఆదివారం 151 జంటలు మూడుముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లి కుమార్తెల కోసం ఖరీదైన బంగారు ఎంబ్రాయిడరీ చీరలు తెప్పించారు. మూడురోజుల పాటు జరిగిన వివాహ వేడుకకు దాదాపు లక్షమంది హాజరయ్యారు. వివాహ వేదికను అందంగా అలంకరించారు. రుచికరమైన వంటలు వండించారు. ఖర్చు 5 కోట్ల రూపాయలు. ఈ ఘనమైన ఏర్పాట్లను చూస్తే అందరూ ధనవంతుల పెళ్లిళ్లు అని అనుకుంటారు. అయితే పెళ్లి కుమార్తెలలో ఎవరికి తండ్రీ లేడు. వివాహం చేసుకోవడానికి ఆర్థిక స్థోమతలేనివారు. సూరత్ చెందిన వజ్రాల వ్యాపారి మహేశ్ శావని ఓ తండ్రిలా వచ్చి.. సొంతఖర్చుతో అంగరంగవైభవంగా పేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించారు.  తమ ఇంట్లో శుభకార్యాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే కోటీశ్వరులు చాలా మంది ఉండొచ్చు కానీ ఇలాంటి దాతలు మాత్రం అరుదు.

కొన్నేళ్లుగా మహేశ్ శావని తండ్రిలేని, నిరుపేద యువతులకు ఓ తండ్రిలా ఉచిత వివాహాలు జరిపిస్తున్నారు. 2008లో మహేశ్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి తన ఇద్దరు కుమార్తెల పెళ్లికి కొన్ని రోజుల మందు మరణించాడు. మహేశ్ తన ఉద్యోగి బాధ్యతలను భుజాన వేసుకుని తండ్రిగా ఆ ఇద్దరు అమ్మాయిలకు వివాహం జరిపించాడు. అప్పట్నుంచి ప్రతి ఏటా తండ్రి లేని నిరుపేద యువతులకు సొంత ఖర్చుతో ఘనంగా వివాహాలు జరిపిస్తున్నారు. ప్రతి వధువుకూ బంగారు నగలు, దుస్తులు, కలశం, ఓ పళ్లెం అందజేస్తారు. పెళ్లి రోజున తండ్రి అవసరం ఎంతన్నది తండ్రిలేనివారికే తెలుస్తుందని విమలా కోరింగా అనే వధువు చెప్పింది. మరో వధువు మీటల్ గోండాలియా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం మా నాన్న మరణించారు. నా పెళ్లికి డబ్బులు ఎలా సమకూర్చాలని అమ్మ ఆందోళన చెందేది. మహేశ్ శావని పప్పా దేవుడిలా వచ్చి ఆదుకున్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement