విమానాల్లోంచి టాయిలెట్‌ వ్యర్థాలు.. ఎన్జీటీ గట్టి వార్నింగ్‌

DGCA Would Have to Attend To Next Prosecution Says NTG - Sakshi

డీజీసీఏ జీతం నిలుపుదల చేయిస్తామని హెచ్చరిక

సాక్షి, న్యూఢిల్లీ: టాయిలెట్‌ వ్యర్థాలను గాల్లో వదిలి వేయకుండా చర్యలు తీసుకోవడానికి తామిచ్చిన మార్గదర్శకాలను పక్కన పడేసిన పౌర విమానయాన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జీతభత్యాలను నిలుపుదల చేయిస్తామని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ హెచ్చరించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో డీజీసీఏ విఫలమయ్యారని మండిపడింది. జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయెల్‌ నేతృత్వలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విమానాల్లో పోగైన టాయిలెట్‌ వ్యర్థాలు గాల్లో పడేయకుండా నిరోధించేందుకు డీజీసీఏకు ఆగస్టు 31 వరకు గడువు విధించింది. లేదంటే సెప్టెంబర్‌ 17 జరిగే తదుపరి విచారణకు డీజీసీ డైరెక్టర్‌ హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇళ్లపై గాల్లోంచి టాయిలెట్‌ వ్యర్థాలు..
ఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గల నివాసాలపై విమానాల నుంచి టాయిలెట్‌ వ్యర్థాలు పడుతున్నాయని 2016లో సావంత్‌ సింగ్‌ దహియా అనే రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ అప్పట్లో డీజీసీయేకు మార్గదర్శకాలు జారీ చేసింది. గాల్లో మానవ వ్యర్థాలను పడేస్తున్న విమాన సంస్థలు పర్యావరణ సహాయ నిధిగా 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ విమాననాశ్రయం గుండా వెళ్లే విమాన సంస్థలకు సర్క్యులర్‌ జారీ చేయాలని డీజీసీఏని ఆదేశించింది.

కాగా, ఎన్జీటీ నోటీసులపై స్పందించిన పౌర విమానయాన సంస్థ.. విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి వ్యర్థాలను పడేసే అవకాశమే ఉండదని తెలిపింది. ఫిర్యాదు దారు ఇంటిపై పక్షుల రెట్టలు పడ్డాయేమోనని పేర్కొంది. నేటి ఆధునిక కాలంలో విమానాల్లో పోగైన మానవ వ్యర్థాలను నిల్వ చేసే సదుపాయం ఉందనీ, విమానాశ్రయాల్లో మాత్రమే వాటిని పడేస్తామని సెలవిచ్చింది. మరోవైపు.. ఫిర్యాదుదారు ఇల్లు, ఆ చుట్టుపక్కల భవనాలపై పడిన వ్యర్థాల నమూనాలు సేకరించి విచారిచేందుకు ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఇళ్లపై పడిన వ్యర్థాలు టాయిలెట్‌ వ్యర్థాలేనని సదరు కమిటీ తేల్చింది. దీంతో మరోమారు ఈ విషయంపై ఎన్జీటీ రంగంలోకి దిగింది. నోటీసులను బేఖాతరు చేసిన డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top