35 గంటల నరకం తర్వాత సురక్షితంగా...

Dewas Bore Well Boy Rescued after 35 Hours Operation - Sakshi

భోపాల్‌ : అధికారుల సమన్వయం ఆ చిన్నారి ప్రాణాలు కాపాడింది. సుమారు 35 గంటల నరకం తర్వాత బోరు బావి నుంచి బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. దేవాస్‌ జిల్లాలోని ఉమరియా గ్రామంలో శనివారం ఉదయం నాలుగేళ్ల బాలుడు బోర్‌ బావిలో పడిపోయిన విషయం తెలిసిందే. 

రెస్క్యూ ఆపరేషన్‌ సాగిందిలా.. శనివారం ఉదయం 11 గంటలకు రోషన్‌ బోరు బావిలో పడిపోయాడు. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. వారు విషయాన్ని అధికారులకు తెలియజేయగా.. గంటలో ఎస్సీ సహా సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ముందుగా బాలుడు 40 లోతుల బోరులో చిక్కుకున్నట్లు అధికారులు భావించారు. అయితే తర్వాత ఆ బోర్‌ బావి యాజమాని అది 150 అడుగుల లోతు ఉందని చెప్పటంతో ఆందోళన మొదలైంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే బాలుడు మరింత లోతుకు వెళ్లిపోయి ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని కంగారు పడ్డారు. 

అధికారుల సమన్వయం... కల్నల్‌ అజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని 60 మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌ కోసం శ్రమించారు. ఈ క్రమంలో బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి.. బయటకు తీయాలని భావించారు. సుమారు 12 గంటల తర్వాత సహాయక చర్యలకు రాళ్లు అడ్డు తగిలాయి. దీంతో డైనమెట్‌ను ఉపయోగించి వాటిని పేల్చేయాలని భావించారు. అయితే ఏమాత్రం తేడా జరిగినా బాలుడి ప్రాణాలకే ప్రమాదం. అందుకే అధికారులు ఆ యత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు బాలుడికి ఆక్సిజన్‌, ఫ్లూయిడ్స్‌ అందిస్తూనే.. తల్లిదండ్రులతో మాట్లాడిస్తూ వచ్చారు. 

ప్రత్యామ్నాయ చర్యలతో ఆదివారం రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగగా.. చివరకు ఓ తాడును ముడిగా వేసి బావి లోపలికి పంపారు. దానిని చెయ్యికి వేసుకోవాల్సిందిగా బాలుడికి తల్లి సూచించింది. ఆపై తాడును బయటకు లాగటంతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఆదివారం రాత్రి 10.30కి ఆపరేషన్‌ ముగిసినట్లు.. బాలుడు క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారులపై, సిబ్బందిపై ప్రశంసలు గుప్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రోషన్‌ తాను బాగానే ఉన్నట్లు మీడియాకు తెలిపాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top