ఉగ్రవాదానికీ ఊతమిచ్చిన బాబ్రీ ఘటన! 

Demolition of Babri Masjid gives boost to the Terrorism - Sakshi

బాబ్రీ మసీదు కూల్చివేతకు పూర్వమూ కొన్ని మతఘర్షణల దాఖలాలున్నాయి. కానీ బాబ్రీ తరువాత కొన్ని ఉగ్రవాద ఘటనలూ చోటుచేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్‌ తనదైన ఆజ్యం పోయడం పరిస్థితి విషమించడానికి దారితీసింది. ఈ సంఘటన తరువాత దాన్ని కారణంగా చూపిస్తూ ఉగ్రమూకలు తెగబడిన దాడులు తక్కువేమీ కాదు.. 

1993 ముంబై దాడులు.. 
బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కుట్ర పన్ని అమలు చేసిన పేలుళ్లు 1993 మార్చి 12న 257 మందిని బలిగొన్నాయి. మధ్యాహ్నం 1.30 నుంచి 3.40 గంటల మధ్యకాలంలో ముంబైలోని 12 చోట్ల కార్లు, స్కూటర్లలో బాంబులుంచి పేల్చేశారు. బాంబు ధాటికి ఓ డబుల్‌ డెక్కర్‌ బస్సు పూర్తిగా ధ్వంసమైపోగా ఈ ఒక్క ఘటనలోనే దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. జస్టిస్‌ పి.డి.కోడే సుమారు 100 మందిని దోషులుగా నిర్దారించారు. 2006లో ప్రత్యేక టాడా కోర్టు... టైగర్‌ మెమన్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని దోషులుగా తేల్చింది.  

ముంబై, కేరళ, హైదరాబాద్‌లలోనూ... 
పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2006 జూలై 11న ముంబైలోని ఓ రైల్లో బాంబు పేలుళ్లకు తెగబడటంతో 187 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక స్థానిక ముస్లింలున్నట్లు విచారణలో తేలింది. కేరళలో ఏర్పాటైన అల్‌ ఉమా అనే ఉగ్రవాద సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడగా.. సంస్థ నాయకుడు సయ్యద్‌ అహ్మద్‌ భాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2007లో కోర్టు తీర్పునిచ్చింది. అల్‌ ఉమాపై నిషేధం విధించారు కూడా.  

బాబ్రీ కూల్చివేత తరువాత ఉగ్రవాదం వైపు మళ్లిన మరో సంస్థ దీన్‌దార్‌ అంజుమన్‌. యూపీలో ఏర్పాటైన సిమీలో ఒకదశలో దేశవ్యాప్తంగా 400 మంది పూర్తిస్థాయి కార్యకర్తలు, ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారని, 30 ఏళ్ల వయసులోపు వారైన వీరు పలు ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, కొన్నింటిని అమలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సిమీ అధ్యక్షుడైన మెకానికల్‌ ఇంజనీర్, జర్నలిస్టుగానూ పనిచేసిన సఫ్దర్‌ నాగోరీ 2008లో అరెస్ట్‌ కావడంతో సంస్థ కార్యకలాపాలు దాదాపుగా సమసిపోయాయి.  2006 నుంచి దేశంలో అత్యంత చురుకుగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల్లో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఒకటి. యూపీ న్యాయస్థానాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. 2008 నాటి ముంబై దాడుల కోసం లష్కరే తోయిబా తరఫున ఐఎం రెక్కీ కూడా నిర్వహించినట్లు వార్తలున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top