
న్యాయశాఖ మంత్రివి నకిలీ సర్టిఫికెట్లే!
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ రూపంలో ఆప్ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. మంత్రి విద్యార్హతలకు సంబంధించి హైకోర్టు తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇరకాటంలో పడ్డారు. మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హతల్ని ప్రశ్నిస్తూ , రికార్డుల్లో ఆయన పేర్కొన్న లా సర్టిఫికెట్ నకిలీదిగా పేర్కొంటూ.. దీనిపై ఆగస్టు 20వ తేదీలోగా దీనిపై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. బీహార్లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా.. అది నకిలీదని పేర్కొంటూ సదరు యూనివర్సిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇరకాటంలో పడ్డారు. మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హతల్ని ప్రశ్నిస్తూ , రికార్డుల్లో ఆయన పేర్కొన్న లా సర్టిఫికెట్ నకిలీదిగా పేర్కొంటూ.. దీనిపై ఆగస్టు 20వ తేదీలోగా దీనిపై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.
తమ యూనివర్సిటీ రికార్డుల్లో ఆయన పేరు లేదని, ఆ సీరియల్ నెంబరుతో వేరే వ్యక్తి పేరు నమోదై ఉందని తేల్చిచెప్పింది. దీంతో ప్రతిపక్షాలకు తాయిలం దొరికినట్టయింది. న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై ఆప్ బహిష్కృత నేతలు కూడా మండిపడుతున్నారు. తక్షణమే న్యాయశాఖ మంత్రిని తొలగించకపోతే ఢిల్లీ సెక్రటేరియట్ ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ప్రశాంత్ భూషణ్ తదితరులు హెచ్చరించారు. అలాంటి వ్యక్తిని న్యాయశాఖమంత్రిగా కొనసాగించడంపై ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ తప్పు బట్టింది.
ప్రతిపక్షాల ఆరోపణలపై ఆప్ స్పందించింది. ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందిగా కేజ్రీవాల్ కూడా మంత్రి తోమర్ను ఆదేశించారు. తనపై వచ్చిన ఆరోపణలు తోమర్ తోసిపుచ్చారు. తన సర్టిఫికెట్ వందశాతం నిజమైనదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఆప్ ప్రభుత్వంలో వివాదంలో ఇరుక్కున్న న్యాయశాఖ మంత్రుల్లో జితేంద్ర తోమర్ రెండోవారు. నైజీరియన్ మహిళ వివాదంలో సోమనాథ్ భారతి చిక్కుకున్న సంగతి తెలిసిందే.