ఓటర్లజాబితాపై హైకోర్టే తేల్చాలి | Decide on bogus voters, Supreme Court tells Hyderabad High Court | Sakshi
Sakshi News home page

ఓటర్లజాబితాపై హైకోర్టే తేల్చాలి

Oct 5 2018 2:13 AM | Updated on Oct 5 2018 2:13 AM

Decide on bogus voters, Supreme Court tells Hyderabad High Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టు శుక్రవారమే విచారించాలని, అవకతవకలు ఉన్నట్టు గుర్తిస్తే ఓటర్ల జాబితా సవ రణ షెడ్యూలును పొడిగించేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితాలో మూడు రకాల లోపాలు ఉన్నాయని, వాటిని సవరించేందుకు వీలుగా ఓటర్ల జాబితా సవరణ పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. మర్రి శశిధర్‌రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, జంధ్యాల రవిశంకర్‌ వాదన లు వినిపించారు.

ఓటరు నమోదుకు జనవరి 1, 2018ని అర్హత తేదీగా పేర్కొన్నారని, దీని కారణంగా దాదాపు 20 లక్షలమంది కొత్త ఓటర్లు ఓటుహక్కును కోల్పోతున్నారని పోతుగంటి శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్‌ వేశారు. మర్రి తరపున సింఘ్వీ వాదిస్తూ 30.13 లక్షల మేర ఓటర్ల పేర్లు పునరావృతమవడం, 20 లక్షల ఓటర్లను తొలగించడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పునరావృతమైన పేర్లు 18 లక్షల మేర ఉండడం వం టి మూడు అంశాలను విపులంగా నివేదించారు.

శశాంక్‌రెడ్డి తరపున నిరూప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జనవరి 1, 2019 అర్హత తేదీతో ఓటర్ల సవరణ షెడ్యూలును పునరుద్ధరించాలని కోరారు.సీఎం కేసీఆర్‌ అభీష్టానికి అసెంబ్లీ రద్దుచేసి, కొత్త ఓటర్లను బలి చేసి వారి ఓటు హక్కు ను 2024 వరకూ వినియోగించుకోకుండా చేస్తారా అని ప్రశ్నించారు. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్‌ న్యాయవాది అమిత్‌ శర్మ వాదిస్తూ ఇదే తరహా పిటిషన్లను హైకోర్టు విచారించి కొట్టి వేసిందని, వీటిని పరిగణనలోకి తీసుకోరాదని వాదించారు. గతవారం ధర్మాసనం నోటీసులు ఇచ్చినప్పుడు దానికి ఈరోజు కౌంటర్‌ వేయకుండా ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు తేవడం సరికాద సింఘ్వీ అన్నారు.

తుది ఓటర్ల జాబితా ఈనెల 8న ప్రచురితం కానుందని, హైకోర్టుకు వెళ్లే సమయం లేదని నివేదించారు.  పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకుంటూ ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారమే(నేడు) విచారించాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్ల అభ్యర్థన న్యాయసమ్మతమని తేలితే ఓటర్ల సవరణను పొడిగించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీచేసే స్వేచ్ఛ హైకోర్టుకు ఉందని సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement