
జ్యోతిరాదిత్య నిర్ణయాన్ని తప్పుపట్టిన త్రిపుర కాంగ్రెస్ మాజీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో చేరికపై జ్యోతిరాదిత్య సింధియా నిర్ణయం సరైంది కాదని ఆయన కజిన్, త్రిపుర కాంగ్రెస్ మాజీ చీఫ్ మాణిక్య వంశానికి చెందిన ప్రద్యుత్ దేవ్‌వర్మ అన్నారు. గత ఏడాది త్రిపుర కాంగ్రెస్ చీఫ్‌గా తనంతట తానుగా వైదొలిగిన వర్మ జ్యోతిరాదిత్య సింధియా నిష్ర్కమణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం యువనేతలకు అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతానికి లోబడిన తామంతా ఒకచోట చేరి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ శిబిరంలోకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని, కాంగ్రెస్ పార్టీ యువతకు చోటు కల్పించని ప్రస్తుత తరుణంలో దేశానికి తాము ఎలా సేవలందించాలనే దానిపై యువనేతలు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం బలమైన విపక్షాన్ని కోరుకుంటున్న క్రమంలో యువ నేతలు ఓ పరిష్కారాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. సచిన్ పైలట్ (రాజస్ధాన్) అజయ్ కుమార్ (జార్ఖండ్) వంటి నేతలకు మంచి నాయకత్వ సామర్థ్యం ఉందని అన్నారు. కాగా మాజీ ఐపీఎస్ అధికారి, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ సైతం గత ఏడాది ఆగస్ట్‌లో పార్టీని వీడి ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరారు. కాగా సింధియాకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న వర్మ వ్యాఖ్యలను ప్రస్తావించగా అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదో రాహుల్ తన కార్యాలయ సిబ్బందిని అడగాలని అన్నారు. మరోవైపు ఏ సమయంలోనైనా తన ఇంటికి నేరుగా వచ్చే వెసులుబాటు ఉన్న నేతల్లో సింధియా ఒకరని రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే.