అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా

CJI Ranjan Gogoi says he may visit Srinagar to understand situation - Sakshi

హైకోర్టును ఆశ్రయించడంలో ఇబ్బందులపై సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ వ్యాఖ్య

ఆ రాష్ట్రంలో పరిస్థితులను సాధారణ స్థాయికి తేవాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశం

సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆజాద్‌కి అనుమతి

ఫరూక్‌ అబ్దుల్లా నిర్బంధం మరో ఆరు నెలలు పొడిగించిన యంత్రాంగం

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: కశ్మీర్‌ స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం అక్కడి పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దీంతోపాటు అవసరమైతే శ్రీనగర్‌కు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. కశ్మీర్‌ హైకోర్టును ఆశ్రయించడంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు స్పందించారు.

కశ్మీర్‌ లోయలో మొబైల్, ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేయడంతో జర్నలిస్టులకు విధి నిర్వహణతోపాటు హైకోర్టును ఆశ్రయించడం ప్రజలకు కష్టంగా మారిందంటూ  దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.  ‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈరోజే మాట్లాడతా. అవసరమైతే శ్రీనగర్‌ వెళ్లి, పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తా’ అని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ పేర్కొన్నారు. ఆరోపణలు తప్పని తేలితే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పిటిషనర్లను హెచ్చరించారు.

ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, జమ్మూకశ్మీర్‌ పరిపాలన యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఈ ప్రక్రియ ప్రాధాన్యతా క్రమంలో, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకే అవగాహన ఉంటుంది కాబట్టి..మోబైల్, ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతపై అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. హైకోర్టుతోపాటు అన్ని కోర్టులు, లోక్‌ అదాలత్‌లు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని కశ్మీర్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

370 రద్దుపై విచారణకు ఓకే
ఆర్టికల్‌–370 రద్దు, కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్‌ చేస్తూ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పార్లమెంట్‌ నిర్ణయం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనానికి  ఈ పిటిషన్‌ను పంపింది. ఆర్టికల్‌–370 రద్దుకు వ్యతిరేకంగా ఇంకా పిటిషన్లను స్వీకరించబోమని, ఈ విషయంలో ఇంప్లీడ్‌మెంట్‌ అప్లికేషన్‌ మాత్రం వేసుకోవచ్చని బెంచ్‌ తెలిపింది. ‘పార్లమెంట్‌ నిర్ణయంలో చట్టబద్ధతపై అక్టోబర్‌లో విచారిస్తాం’ అని కోర్టు తెలిపింది.

ఆజాద్‌కు అనుమతి
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ కశ్మీర్‌ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఆయన అక్కడ రాజకీయ సమావేశాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా, అనంత్‌నాగ్‌ జిల్లాలకు వెళ్లి ప్రజలను కలసుకోవచ్చని పేర్కొంది. తన కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆజాద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. అలాగే, అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కశ్మీర్‌ సీపీఎం నేత యూసఫ్‌ తారిగమి సొంత రాష్ట్రం వెళ్లేందుకు కోర్టు ఓకే చెప్పింది.

ఫరూక్‌ అబ్దుల్లాకు సొంతిల్లే జైలు
కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా(81) సోమవారం ప్రజాభద్రత చట్టం(పీఎస్‌ఏ)లోని ‘పబ్లిక్‌ ఆర్డర్‌’ నిబంధన కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎటువంటి విచారణ లేకుండా ఆరు నెలలపాటు జైల్లో ఉంచేందుకు అవకాశం కల్పించే, కశ్మీర్‌కు మాత్రమే వర్తించే చట్టం ఇది. శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్డులోని ఫరూక్‌ నివాసాన్నే తాత్కాలిక జైలుగా అధికారులు ప్రకటించారు. ఆర్టికల్‌ 370ను కేంద్రప్రభుత్వం రద్దుచేసిన నాటి నుంచీ అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్‌ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top