
కరోనా వైరస్ తిరగబెట్టే అవకాశం ఉందన్న నిపుణులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ అమలు చేస్తుంటే ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారిని తిరిగి వారి పనుల్లోకి అనుమతించాలనే వాదన వినిపిస్తోంది. అయితే కరోనా వైరస్ నుంచి బయటపడిన వారు వెనువెంటనే సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తుందా వారికి వ్యాధి తిరగబడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వైరస్‌ను శరీరం తట్టుకుని నిలబడినప్పుడు సహజంగానే ఆ వ్యక్తి రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుందని చెబుతారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి కనీసం కొన్ని నెలల పాటు ఆ వైరస్ తిరిగి రాకుంటే పూర్తిగా కోలుకున్నట్టే అని కొందరు చెబుతుండగా ఈ నిర్ధారణకు వచ్చేందుకు సరైన శాస్ర్తీయ గణాంకాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక వ్యాధికారక వైరస్ లేదా బ్యాక్టీరియా దాని పరిమాణం మానవ శరీర రోగనిరోధక వ్యవస్థ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను బట్టి వాటి దుష్ర్పభావం ఎంత మేర ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి ద్వారా తయారయ్యే యాంటీబాడీలు వ్యాధికారక కణాలను నిర్వీర్యం చేస్తాయి. కరోనా వైరస్ విషయంలో కూడా అదే జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వైరస్‌లు తరచూ తమ భౌతిక జన్యు రూపాలను మార్చుకుంటూ ఉండటంతో వాటి విస్తృత వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సంక్లిష్టమవుతంది.
చదవండి : వేలాది మంది చస్తారంటూ హెచ్చరిక
అందుకే బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసేందుకు ఇచ్చే మందులు సమర్ధంగా పనిచేస్తుంటాయి కానీ వైరస్‌లపై అవి అంత దీటుగా పనిచేయవని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనావైరస్ కూడా వేర్వేరు స్వరూపాలతో పరివర్తన చెందుతున్నట్లు గుర్తించబడింది. అంటే కరోనావైరస్ నుంచి కోలుకున్న రోగి శరీరం ఒక రకమైన సార్స్, కోవిడ్-2ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసినప్పటికీ, అది స్వరూపం మార్చుకున్న కరోనా మహమ్మారి నుంచి ఆ వ్యక్తిని రక్షించదు. అలాగే, డెంగ్యూ, జలుబు మరియు స్మాల్ పాక్స్ వంటి అనేక వైరస్లు ఒకే ఇన్ఫెక్షన్ సీజన్ కంటే తక్కువ వ్యవధిలో ఒక వ్యక్తికి రెండుసార్లు సులభంగా సోకుతాయని గుర్తించిన క్రమంలో కరోనా వైరస్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది.
వ్యాక్సిన్ పనిచేయదా..?
ఇక గబ్బిలాల నుంచి వందలాది కరోనా వైరస్‌లు మానవులకు వ్యాప్తి చెందేందుకు రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉన్నాయని ఒక కరోనా వైరస్ కోసం రూపొందించిన వ్యాక్సిన్ లేదా మందు మరో వైరస్‌పై ప్రభావం చూపే అవకాశం లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. మానవుల్లో వ్యాప్తి చెందే కరోనా వైరస్‌లకు సంబంధించి ఇన్ఫెక్షన్లు తిరిగి సోకే అవకాశం ఉందని అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఓ పరిశోధనా పత్రం పేర్కొంది.
కోవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు రోగులకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తిరిగి సోకినట్టు గుర్తించారని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ (జామా)లో ప్రచురితమైన మరో అథ్యయనం వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ తిరగబెట్టిన కేసులు ఫిబ్రవరిలో పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. జపాన్ నుంచి తిరిగివచ్చిన వారిలో కరోనా మహమ్మారి తిరగబెట్టినట్టు గుర్తించామని ఈ నివేదిక తెలిపింది. అయితే కరోనా వైరస్ తిరగబెట్టిన రోగుల్లో తీవ్రమైన లక్షణాలు ఉండవని కోతులపై జరిపిన పరిశోధనలో వెల్లడవడం కొంత ఊరట ఇస్తోంది.