నిర్లక్ష్యం... తల్లి ఒడిలోనే కన్నుమూత
జార్ఖండ్ లో అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది.
రాంచీ: జార్ఖండ్‌లో అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలి తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఆస్పత్రి సిబ్బంది ఆంబులెన్స్ ను నిరాకరించటంతో,.. కాలినడకనే తన బిడ్డను ఒడిలో పెట్టుకుని బయలుదేరింది. అయితే మార్గం మధ్యలోనే పసికందు ప్రాణాలు వదిలిన ఘటన సంచలనంగా మారింది.
గుమ్ల గ్రామానికి చెందిన ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారికి ఆరోగ్యం బాగోలేదని సర్దార్ ఆస్పత్రిలో చేర్పించింది. అయితే అక్కడ వైద్య సిబ్బంది చికిత్స అనంతరం ఆంబులెన్స్ ను నిరాకరించారు. దీంతో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి నడుస్తూనే ఆమె బయలుదేరింది. కొద్దిదూరం అలా వెళ్లాక అమ్మ ఒడిలోనే బిడ్డ కన్నుమూసింది. దీంతో ఘటనపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.
తాము వైద్యానికి సహకరించలేదన్న ఆరోపణలను నిరాకరించామనే ఆరోపణలను సర్దార్ ఆస్పత్రి వైద్యుడు ఆర్‌ఎన్ యాదవ్ తోసిపుచ్చారు. ‘ఆ చిన్నారికి ఇక్కడ చికిత్స అందించాం. వేరే ఆస్పత్రికి సూచించామన్న వార్తలో కూడా నిజం లేదు. కానీ, తర్వాత ఎందుకనో ఆమె పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయింది’ అని యాదవ్ చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.
‘చేతిలో చిన్నారి శవంతో ఓ మహిళ రోడ్డు మీద కనిపించింది. చుట్టూ జనాలు గుమిగూడారు. ఆమెను అలా చూసి జాలితో ఇంటికి వెళ్లేందుకు కొందరు డబ్బు సాయం కూడా చేశారు’ అని ఓ పోలీసాధికారి తెలిపారు.