
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ మంత్రి కవాసి లఖ్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నెల సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి సుక్మా జిల్లాలోని పావ్నార్ గ్రామంలో ఉన్న ఓ పాఠశాలకు ముఖ్యఅతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులు మంత్రిని పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఓ విద్యార్థి ‘మీలాగా పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే.. ఏం చేయాలి’ అని ప్రశ్నించాడు.
విద్యార్థి ప్రశ్నకు మంత్రి ఏమాత్రం తడుముకోకుండా.. ‘జిల్లా కలెక్టర్లు, ఎస్పీల చొక్కా కాలర్ పట్టుకొవాలి’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న విద్యార్థులు నవ్వారు. అయితే రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న కవాసి చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్లు, ఎస్పీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తమను అవమానించారని విమర్శించారు. దీంతో మంత్రి స్పందించి.. ‘నేను విద్యార్థులతో సరదాగా వ్యాఖ్యానించిన మాటలు వక్రీకరించబడ్డాయని’ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు మిమ్మల్ని కించపరిచే విధంగా చేసినవి కాదని మంత్రి వివరణ ఇచ్చారు. మంత్రి కవాసి సుక్మా జిల్లాలోని కొంటా ప్రాంతం నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారన్న విషయం తెలిసిందే.