నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

20 లక్షల కొలువుల భర్తీకి కేం‍ద్రం రెడీ

Published Thu, Sep 28 2017 8:40 AM

govt jobs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగ యువత సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్టే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 20 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు భారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీల భర్తీతో పాటు 244 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. కేవలం రైల్వేల్లోనే 2 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మోదీ సర్కార్‌పై నెలకొన్న ఉపాధి రహిత వృద్ధి విమర్శలను తిప్పికొట్టేందుకు భారీ కొలువుల మేళాకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పూనుకుంది. కార్మిక శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను గుర్తిస్తోంది. ఖాళీల సంఖ్య వెల్లడైన అనంతరం వీటి భర్తీకి రోజువారీ, వారం, నెలల ప్రాతిపదికన నియామకాలను చేపట్టేందుకు కాలపరిమితిని నిర్ణయిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గత ప్రభుత్వాలు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏళ్ల తరబడి నియామకాలకు చెక్‌ పెట్టడంతో పెద్దసంఖ్యలో ఖాళీలు పేరుకుపోయాయి. సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో ఆరు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. ఈ కసరత్తు రాష్ట్రాల్లోనూ జరిగితే రానున్న కొద్ది మాసాల్లో 20 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. కార్మిక శాఖ త్వరలోనే అన్ని మంత్రిత్వ శాఖలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు తమ పరిధిలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను పంపాలని లేఖ రాయనుంది. ఈ వివరాలు రాగానే ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు కాలపరిమితిని నిర్ధేశిస్తుందని అధికారులు చెప్పారు.


భర్తీ చేసే పోస్టులివే..
పోలీసు శాఖలో 5 లక్షలకు పైగా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఎలిమెంటరీ స్కూళ్లలో 5 లక్షలకు పైగా టీచర్ల నియామకం చేపట్టనుంది. రెండు లక్షల మందికి పైగా అంగన్‌వాడీ కార్మికులకు ఉపాధి కల్పించనుంది. రైల్వేల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులను భర్తీ చేయనుంది. ఆదాయ పన్ను శాఖలో 32,000 మందికి పైగా రిక్రూట్‌ చేసుకోనున్నారు. ఇవే కాక పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement