వలస కూలీలకు అవకాశం 

Central Government Take Key Decision On Migrant laborers - Sakshi

రాష్ట్రం పరిధిలో ఉంటే సొంతూళ్లకు అనుమతించండి 

రాష్ట్రాలు దాటి వెళ్లేందుకు అనుమతి నో 

కేంద్రం ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు ఏప్రిల్‌ 20 తరువాత, తాము పనిచేసే ప్రాంతం అదే రాష్ట్రంలో ఉంటే.. అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. నిర్మాణ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు, ఉపాధి హామీ పనుల్లోని కార్మికులకు ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. అయితే, వారు తాము ఉన్న రాష్ట్రాలను దాటి వెళ్లేందుకు అనుమతించకూడదని స్పష్టం చేసింది. మే 3 వరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది.

రాష్ట్రం లోపల కూడా వలస కూలీల ప్రయాణాల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాలని పేర్కొంది. సహాయక కేంద్రాల్లో ఉన్న కార్మికులు తాము చేసే పని, తమ నైపుణ్యాల వివరాలతో స్థానిక అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. తద్వారా వారికి అనువైన పనులను వెతకడం సులువవుతుందని తెలిపింది. తాము పనిచేసే ప్రదేశానికి బృందాలుగా వెళ్లాలనుకునే కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపి, నెగెటివ్‌గా తేలినవారిని, ఆయా ప్రాంతాలకు తరలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ సూచించింది.

లాక్‌డౌన్‌ను మే 3 తరువాత కూడా పొడిగించాల్సి వస్తే.. వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, విద్యార్థులకు సంబంధించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ ఆదివారం వెల్లడించారు. ఏప్రిల్‌ 20 తరువాత కొన్ని కార్యకలాపాలకు అనుమతించిన ప్రాంతాలపై సునిశిత దృష్టి పెట్టాలని హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top