సీబీఎస్‌ఈ ‘12’ ఫలితాలు విడుదల | CBSE Class 12th Results released | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ ‘12’ ఫలితాలు విడుదల

May 27 2018 2:54 AM | Updated on Sep 26 2018 3:23 PM

CBSE Class 12th Results released - Sakshi

మేఘన శ్రీవాస్తవ

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మేఘన శ్రీవాస్తవ ఈ పరీక్షలో 99.8 శాతం(500 మార్కులకు గానూ 499) మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించినట్లు సీబీఎస్‌ఈ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ పరీక్షలో అబ్బాయిలు 78.99 శాతం, అమ్మాయిలు 88.31 శాతం ఉత్తీర్ణత పొందారు.

ఇక యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన అనౌష్కా చంద్ర 498 మార్కులతో రెండోస్థానంలో నిలవగా, 497 మార్కులతో మరో ఏడుగురు విద్యార్థులు మూడోస్థానంలో నిలిచారన్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నేత షాబిర్‌ షా కుమార్తె సమా షాబిర్‌ ఈ పరీక్షల్లో  97.8 శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే విదేశాల్లోని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 94.94 శాతానికి చేరుకుందన్నారు. కొన్నిరోజుల క్రితం 12వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన సీబీఎస్‌ఈని కుదిపేసినప్పటికీ నిర్ణీత గడువులోగానే ఫలితాలను ప్రకటించడం గమనార్హం.

కాగా పరీక్షా ఫలితాల అనంతరం టాపర్‌ మేఘన మీడియాతో మాట్లాడుతూ.. ‘టాపర్‌గా నిలుస్తానని అస్సలు ఊహించలేదు. ఏడాదంతా నిరంతరం కష్టపడి చదవడం వల్లే ఇది సాధ్యమైంది’ అని చెప్పారు. మరోవైపు విద్యార్థులు పరీక్షా ఫలితాల అనంతరం ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వీలుగా 1800–11–8004 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు సీబీఎస్‌ఈ ప్రజా సంబంధాల అధికారి రమా శర్మ తెలిపారు. ఇందులో భాగంగా 69 మంది కౌన్సెలర్లు, నిపుణులు(49 మంది భారత్‌లో, మిగతావారు విదేశాల్లో) ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తారని వెల్లడించారు. ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకూ నిపుణులు అందుబాటులో ఉంటారని రమా శర్మ  చెప్పారు.
మేఘన శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement