ఎంపీల వేతనాల్లో 30% కోత

Cabinet reduces salaries of MPs by 30percent for a year - Sakshi

ప్రధాని, కేంద్ర మంత్రులకూ వర్తింపు

కరోనాపై పోరుకు ఆ నిధులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్‌ అండ్‌ పెన్షన్‌ ఆఫ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ యాక్ట్‌–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ  సామాజిక బాధ్యతలో భాగంగా, తమ వేతనాల్లో కొంత భాగాన్ని కరోనాపై పోరుకు వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. సాయం అందించడం మన నుంచే ప్రారంభం కావాలన్న నానుడిని ఈ సందర్భంగా జవదేకర్‌ ఉటంకించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్‌గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి.

అయితే, ఈ కోత వేతనానికే అని, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో ఈ కోత ఉండబోదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఎంపీల్యాడ్‌(ఎంపీ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌) ఫండ్‌ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020–21, 2021–22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్‌–19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు.

ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స్‌ కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి. వేతనాల్లో కోత ద్వారా కోల్పోయే మొత్తం ఎంపీలకు పెద్ద సమస్య కాబోదు కానీ, ఎంపీల్యాడ్స్‌ను కోల్పోవడంతో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.  ఎంపీల వేతనాల్లో కోత నిర్ణయాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. అయితే, ఎంపీల్యాడ్స్‌పై నిర్ణయానికి సంబంధించి పునరాలోచించాలని కోరింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top