
యూఏఈలో ముఖ్యప్రదేశాల్లోని వెలుగు జిలుగుల్లో జాతీయ పతాకం
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలు త్రివర్ణ పతాక రంగులతో కళకళలాడాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడీఎన్‌ఓసీ), ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ ‘దుబాయ్ ఫ్రేమ్’లు మన జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేశాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలను యూఏఈలో భారత రాయబారి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలస్తీనా నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకుంటారు. యూఏఈ పర్యటనలో మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఆదివారం దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగిస్తారు.