
ఇండోర్ : డాక్టర్ల మాటల్ని లెక్కచేయకుండా ప్రవర్తించి ఓ బాలుడి మరణానికి కారణమయ్యారు అతడి కుటుంబసభ్యులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ అత్యవసర చికిత్స నిమిత్తం శనివారం మహరాజా యశ్వంత్‌రావ్ ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అయితే బాలుడికి ‘‘ఆక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్’’ సోకిందని కుటుంబసభ్యులు భావించారు. ఇక బాలుడు బతకడనే ఉద్ధేశ్యంతో ఐసీయూలో ఉన్న అతడిని ఇంటికి తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూలో ఉన్న బాలుడ్ని ఇంటికి తీసుకెళ్లవద్దని డాక్టర్లు వారించారు. కానీ బాలుడి కుటుంబసభ్యులు వినకుండా అతడిని ఇంటికి తీసుకెళ్లిపోయారు.
దీంతో ఆదివారం బాలుడు కన్నుమూశాడు. దీనిపై బాలుడికి చికిత్స చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. బాలుడికి వచ్చిన జ్వరానికి ఆక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్‌కు లక్షణాలలో తేడా ఉందని చెప్పారు. ప్రజలు ఎన్సెఫాలైటిస్ గురించి భయపడవల్సిన అవసరం లేదన్నారు. బాలుడి రక్త నమూనాలు సేకరించామని, రక్త పరీక్షల ఫలితాల అనంతరం అతడి వ్యాధిని నిర్థారిస్తామని చెప్పారు. ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్ కారణంగా బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో దాదాపు 130మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.