తెలుగు విద్యార్థులకు ‘సరిహద్దు’ గండం | 'Border' danger to Telugu students | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థులకు ‘సరిహద్దు’ గండం

Oct 8 2016 2:00 AM | Updated on Jul 11 2019 6:33 PM

తెలుగు విద్యార్థులకు ‘సరిహద్దు’ గండం - Sakshi

తెలుగు విద్యార్థులకు ‘సరిహద్దు’ గండం

భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ ‘నిట్’ ఇంజనీరింగ్ కళాళాల విద్యార్థుల చదువులకు ఆటంకమేర్పడింది.

సాక్షి, అమరావతి: భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ ‘నిట్’ ఇంజనీరింగ్ కళాళాల విద్యార్థుల చదువులకు ఆటంకమేర్పడింది. రెండు దేశాల సరిహద్దుల్లో నిట్ కళాశాల ఉండటం.. ఇక్కడ ఏడాదిన్నరగా ఆందోళనకర పరిస్థితులతో విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయో.. అసలు ఈ ఏడాది కళాశాల ప్రారంభమవుతుందో లేదో తెలియక ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో కళాశాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

శ్రీనగర్ నిట్ కళాశాలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 5న ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. తర్వాతి ఏడాదికి సంబంధించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభించాలి. జూలై 15న నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి తరగతులు ప్రారంభిస్తామని నిట్ యాజమాన్యం ప్రకటించింది. పది రోజుల వ్యవధిలో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు రాకుండా శ్రీనగర్‌లోనే ఉండిపోయారు. అయితే జూలై 8న శ్రీనగర్‌లో బృహన్ అనే ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నిట్ యాజమాన్యం విద్యా సంవత్సర ప్రారంభ తేదీని పొడిగించింది. పైగా విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పించలేదు. కళాశాల ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా తెలియక విద్యార్థులు శ్రీనగర్‌లోనే ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉండిపోయారు.

 అక్కడే ఉంటున్నారు..
 శ్రీనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు రావడానికి దూరం ఉండటం, చార్జీల భారం ఎక్కువనే ఉద్దేశంతో అక్కడే ఉంటున్నారని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. జూలై నెలాఖరుకైనా విద్యా సంవత్సరం ప్రారంభిస్తే డిసెంబర్ మొదటి వారానికి తొలి సెమిస్టర్ పూర్తయ్యేదని, ఇప్పటికీ ఆరంభం కాకపోవడంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో నిర్ణయం తాము తీసుకోలేమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈనెల 4న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమావేశం జరిగినా, శ్రీనగర్ నిట్ కళాశాల ప్రారంభంపై నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన రెట్టింపైంది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సొంత రాష్ట్రాల్లోని నిట్‌లో చేరే అవకాశం కల్పిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఢోకా ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement