కరువు కనిపించలేదా? | BJP serious on DF government | Sakshi
Sakshi News home page

కరువు కనిపించలేదా?

Aug 13 2014 10:19 PM | Updated on Mar 29 2019 9:24 PM

రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోవడంలేదని బీజేపీ ఆరోపించింది.

 లాతూర్: రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోవడంలేదని బీజేపీ ఆరోపించింది. మరాఠ్వాడా వంటి ప్రాంతాల్లో వర్షాలు లేక పంట భూములు బీడివారిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని  ఆ పార్టీ విమర్శించింది.

 రాష్ట్రాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డీఎఫ్ ప్రభుత్వాన్ని బీజీపీ డిమాండ్ చేసింది. ఇలా చేయడం వల్ల కేంద్రం నుంచి కరువు నివారణ చర్యలకు గాను నిధులను రాబట్టేందుకు అవకాశముంటుందని పేర్కొంది. బీజేపీ నాయకుడు, రాష్ట్ర విధాన కౌన్సిల్‌లో ప్రతిపక్షనేత అయిన వినోద్ తావ్డే బుధవారం మీడియాతో మాట్లాడారు. వర్షాలు లేక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ప్రకటించి కేంద్రంలోని మోడీ సర్కార్‌తో మాట్లాడి నిధులు తేవాలని ఆయన సూచించారు.

‘కరువు ప్రాంతాల్లో మున్ముందు వర్షాలు పడతాయోమోనని సీఎం ఇంకా ఆశలు పెట్టుకుని ఉన్నారేమో... ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది..’ అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రం సుమారు రూ.3 లక్షల కోట్ల రుణభారంలో ఉందని ఆయన అన్నారు. డీఎఫ్ ప్రభుత్వ హయాంలో అవినీతి కోరలు చాచడంతో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని తావ్డే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతులకు సకాలంలో విత్తనాలు అందజేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత కరువుపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో  శాంతిభద్రతలు కూడా క్షీణించాయని తావ్డే విమర్శించారు. ఎంహెచ్‌ఏ నివేదిక ప్రకారం శాంతిభద్రతల విషయంలో మన రాష్ట్రం 27వ స్థానంలో ఉందని ఆయన చెప్పారు.

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై తావ్డే స్పందిస్తూ.. బీజేపీ, శివసేన సీనియర్ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కూటమిలోని అన్ని పార్టీలకూ సముచితమైన పాత్ర ఉండేలా సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై చర్చలు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తమ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తావ్డే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement