కాషాయాన్నీ వదలని ‘వారసత్వం’..!

Bjp Also Going Under Dynastic Politics - Sakshi

పంథా మారుస్తున్న కమల నేతలు

వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి

నేతల కొత్త డిమాండ్‌లతో తలపట్టుకుంటున్న బీజేపీ హైకమాండ్‌

సాక్షి వెబ్‌ ప్రత్యేకం (భోపాల్‌): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్‌ విపక్ష బీజేపీ నేత గోపాల్‌ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్‌ నాయకులు తమ వారసులకు లోక్‌సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్‌ మీడియాను యాక్టివ్‌గా ఉపయోగించే గోపాల్‌ భార్గవ కుమారుడు అభిషేక్‌ ప్రస్తుత మధ్యప్రదేశ్‌ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

వారసులూ అర్హులే..
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్‌ కూడా తన కూతురు మౌసమ్‌ బీ సేన్‌కు బాలాఘాట్‌ నియోజకవర్గ లోక్‌సభ టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్‌ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్‌-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. 

పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి
మాజీ మంత్రి గౌరీ శంకర్‌ షెజ్వార్‌ తనయుడు ముదిత్‌ ఈసారి లోక్‌సభ టిక్కెట్‌ దక్కించుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్‌ తోమర్‌ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్‌ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్‌ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న​ వారసత్వ రగడను చూసి కాంగ్రెస్‌ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top