మహిళలకు ప్రత్యేక సదుపాయం! | Sakshi
Sakshi News home page

మహిళలకు ప్రత్యేక సదుపాయం!

Published Sat, Mar 19 2016 3:43 PM

మహిళలకు ప్రత్యేక సదుపాయం!

పాట్నాః మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ బీహార్ ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయం కల్పించింది. వాణిజ్య వాహనాలు కొనుగోలు చేసే వారికి వందశాతం పన్ను మినహాయింపును ప్రకటించింది. ప్రజా రవాణా వ్యాపారం చేపట్టాలనుకునే మహిళలు, వికలాంగులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి వాణిజ్య వాహనాల కొనుగోళ్ళలో వందశాతం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.

''జీవనోపాధికోసం ప్రజా రవాణా వ్యాపారాన్ని చేపట్టి తద్వారా వాణిజ్య వాహనాలను కొనుగోళ్ళు చేపట్టే మహిళలు, వికలాంగ ప్రజలకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం పన్ను మినహాయింపును అందిస్తుంది'' అని ట్రాన్స్ పోర్ట్ మంత్రి చంద్రికా రాయ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంలో వెల్లడించారు. లభ్దిదారులు డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించి పన్ను మినహాయింపు పొందవచ్చని ఆయన ఈ సందర్భంలో తెలిపారు. రవాణా శాఖ ప్రతిపాదించిన పన్ను మినహాయింపు బడ్జెట్ డిమాండ్ ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

తాజా ప్రతిపాదనల్లో భాగంగా కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తున్నట్లు కూడ ఈ సందర్భంలో మంత్రి చంద్రికా రాయ్ వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతకు రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా రోడ్ సేఫ్టీ ఫండ్ కోసం కూడ రాయ్ ప్రతిపాదించారు. రోడ్ సేఫ్టేకి సంబంధించిన విషయాలను విద్యార్థులకు ఆరవ తరగతినుంచీ ఎనిమిదవ తరగతి మధ్య పాఠ్యాంశాలుగా బోధించాల్సిన అవసరం ఉందని, ఇలా చేస్తే భవిష్యత్తులో డ్రైవింగ్ సమయంలో ముందు జాగ్రత్తలను పాటించి ప్రమాదాలను నివారించగల్గుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్లకు కూడ అనుమతులు మంజూరు చేయనున్నట్లు రాయ్ ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement
Advertisement