ఆ నగరాలు సురక్షితం కాదు

Bhopal, Gwalior and Jodhpur due to isolated and unsafe areas - Sakshi

భోపాల్, గ్వాలియర్, జోధ్‌పూర్‌లు తమకు క్షేమం కాదంటున్న మహిళలు

తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ నగరాలు తమకు సురక్షితం కాదని మహిళలు అభిప్రాయపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతాల్లో జనావాసం తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు ఇవి సుదూరంగా ఉండటం వంటి కారణాల వల్ల తమకు రక్షణ కరువైనట్లు మహిళలు భావిస్తున్నారు. సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్‌లు ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. దీనికి గానూ భోపాల్‌ (77), గ్వాలియర్‌ (75), జోధ్‌పూర్‌ (67) నగరాల నుంచి 219 సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాయి. ఈ మూడు ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

ఈ ప్రదేశాలు నిర్జనంగా ఉండటం వల్ల తమకు రక్షణ కరువైందని 89 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. తమకు రక్షణ కరువైందని భావించడానికి మహిళలు పలు కారణాలను వెల్లడించారు. డ్రగ్స్, మద్యం అందుబాటులో ఉండటం (86 శాతం), ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం (63 శాతం), సరైన భద్రత లేకపోవడం (68 శాతం) వంటివి కారణాలుగా పేర్కొన్నారు. బస్సులు, ఆటోల్లో ప్రయాణించే సమయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు 50 శాతం మంది తెలిపారు. మార్కెట్లు వంటి చోట్ల వేధింపులకు గురవుతున్నామని 39 శాతం మంది వెల్లడించారు. రోడ్డు పక్కన వెళ్తుండగా (26 శాతం మంది), ట్రాన్స్‌పోర్ట్‌ కోసం వేచిచూసే సమయంలో (16 శాతం) సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top